ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్- దసరాకు అదనపు సెలవు..!
ఏపీలో దసరా పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కార్ (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. దసరా పండుగకు ముందు వరుసగా సెలవులు రావడం, మధ్యలో ఒక రోజు వర్కింగ్ డే ఉండటం, ఆ తర్వాత తిరిగి దసరా సెలవులు రావడంతో కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యలో రోజును కూడా సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో ఉద్యోగులు దసరా సెలవుల్ని పూర్తి స్ధాయిలో ఎంజాయ్ చేసేందుకు వీలు కలగనుంది.
రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో లేని ఇతర ఉద్యోగులకు ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా మరో అదనపు సెలవు ఇస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు రేపు, ఎల్లుండి వరుసగా శని, ఆదివారాలు సెలవులు వచ్చాయి. అయితే సోమవారం ఒక రోజు పని దినం. ఆ తర్వాత తిరిగి మంగళవారం దసరా సెలవు ఉంది. దీంతో సోమవారాన్ని కూడా సెలవు రోజుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారం ఎలాగో దసరా సెలవు కావడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులపాటు సెలవు దినాలు రాబోతున్నాయి. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు విద్యాసాగర్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 19న సోమవారం మహర్నవమి సందర్బంగా ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా 19-10-2026న ప్రకటించిన సెలవుకు బదులుగా 14-11-2026 (రెండవ శనివారం) పనిదినంగా ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఎన్నికల ప్రక్రియ లేదా ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల్లో నిమగ్నమైన సిబ్బంది తమకు కేటాయించిన విధులకు హాజరవుతూ కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగతా ఉద్యోగులకు మాత్రం ఈ సెలవు వర్తింపజేయనున్నారు.














Click it and Unblock the Notifications
