ఉద్యోగులకు దీపావళి ధమాకా.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. వివరాలివే!
దీపావళి పండుగ నేపథ్యంలో భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 11.4 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మొత్తం రూ.2,009 కోట్లను ఉద్యోగుల బోనస్ కోసం వెచ్చించనుంది. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ.. ఇది ఉద్యోగులకు ప్రభుత్వం అందిస్తున్న దీపావళి కానుక అని అభివర్ణించారు.
ఒక్కో ఉద్యోగికి రూ.17,951 బోనస్ లభింపు
రైల్వే పరిధిలోని నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ఈ వార్షిక బోనస్ అందుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న సీలింగ్ పరిమితి రూ.7,000 వేతనం ప్రాతిపదికగా.. 78 రోజుల కాలానికి లెక్కించి ఒక్కో అర్హుడైన ఉద్యోగికి రూ.17,951 బోనస్‌గా అందజేయనున్నారు. అయితే ఈ రూ.7,000 వేతన సీలింగ్ పరిమితి 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి మార్పు లేకుండా కొనసాగుతుండటం గమనార్హం.

వేతన పరిమితి పెంపుపై టెక్నికల్ సూపర్వైజర్ల డిమాండ్
ప్రస్తుత వేతన పరిమితి కాలం చెల్లినదని, కనీస వేతనాలు పెరిగిన దృష్ట్యా ఈ సీలింగ్‌ను సవరించాలని 'ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్' డిమాండ్ చేసింది. లెవెల్-2, కంటే ఎక్కువ స్థాయి ఉన్న ఉద్యోగులకు రూ. 18,000 ప్లస్ కరువు భత్యం ఆధారంగా బోనస్‌ను లెక్కించాలని, దాని ప్రకారం వార్షిక బోనస్‌ను కనీసం రూ. 46,184కి పెంచాలని విజ్ఞప్తి చేసింది.
నకిలీ బోనస్ సర్క్యులర్‌పై రైల్వే బోర్డు హెచ్చరికలు
ఈ అధికారిక ప్రకటన రావడానికి కొద్ది రోజుల ముందే సోషల్ మీడియాలో చలామణి అయిన ఓ నకిలీ బోనస్ లేఖపై రైల్వే బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ 78 రోజుల బోనస్‌గా రూ.41,149 ఇస్తున్నట్లు నకిలీ సంతకంతో అక్టోబర్ 6 నాటి పత్రాన్ని ప్రచారం చేశారు. దీనిపై అప్రమత్తమైన రైల్వే బోర్డు, అటువంటి నకిలీ పత్రాలను నమ్మవద్దని, బోనస్ వివరాల కోసం కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని ఉద్యోగులను హెచ్చరించింది.













Click it and Unblock the Notifications
