దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం.. సాయం కోసం ఢిల్లీబాట.. ఎల్ నినోపై రేవంత్ ప్లాన్!
ఎల్నినో ప్రభావం తెలంగాణా రాష్ట్రంపై దారుణంగా ఉండబోతోంది. దీంతో ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవటానికి ఏం చెయ్యాలి అన్న అంశంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించి, కేంద్రాన్ని సాయం కోరాలని భావిస్తున్నారు తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి.
తాజాగా సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ తెలంగాణలో తీవ్రమైన నీటి, విద్యుత్ సంక్షోభం ఏర్పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రైతులు ఒక సీజన్ పంట, ముఖ్యంగా వరి వేయకుండా వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటిని ప్రాధాన్యం ఇవ్వాలని, సాగుకు నీరు సరిపోదని స్పష్టం చేశారు.

ప్రస్తుతం రిజర్వాయర్లలో కేవలం 200 టీఎంసీల నీరు మాత్రమే ఉందని, గతేడాది ఇదే సమయానికి 462 టీఎంసీలు ఉండేవని తెలిపారు. 24 వేల గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉండటంతో నీటిని పొదుపుగా వాడాలని కోరారు. విద్యుత్ వినియోగం 20 వేల మెగావాట్లకు చేరుకుందని, గత సంవత్సరాలలో 15 వేల మెగావాట్లు ఉండేదని చెప్పారు.
రైతులు తప్పుడు ప్రచారాలు నమ్మి వరి వేస్తే పంటలు ఎండిపోయి పెట్టుబడి నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విపత్తు సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంతో పాటు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు, సంఘాలు, మహిళా, విద్యార్థి సంఘాలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .
ఈ ప్రకృతి విపత్తును జయించడానికి అందరి సహకారం కావాలని ఆయన కోరుతున్నారు. దసరా తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల వారి సలహాలు తీసుకుంటామని, నవంబర్లో అఖిలపక్ష బృందంతో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి తెలంగాణా రాష్ట్రానికి, రైతాంగాన్ని ఆదుకోవటానికి కావాల్సిన సహాయం కోరుతామని తెలిపారు.
ఈ క్రమంలో ఎల్ నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు.సీఎం సలహాదారు కే. రామకృష్ణా రావును నోడల్ అధికారిగా నియమించి, తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా, ప్రభుత్వం తరఫున ఎప్పటికప్పుడు సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్తో వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు పెంచి భూమిలేని కూలీలను ఆదుకోవాలని సూచించారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు అందరి సహకారం అవసరమని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.













Click it and Unblock the Notifications
