కాలినడకన దుర్గగుడికి వెళ్తోన్న భక్తులపై దూసుకెళ్లిన ట్రక్: 13 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదంలో 13 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. సుమారు 39 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
ఈ వేకువ జామున 1:30 గంటల సమయంలో గ్వాలియర్ జిల్లా ఛినోర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ కూడా అమ్మవారి భక్తులు. దసరా పండగను పురస్కరించుకుని కాలినడకన ప్రఖ్యాత శీతల్ మాతా ఆలయానికి వెళ్తున్న వాళ్లే. ఆలయానికి సమీపంలో వెళ్తోన్న భక్తులపై ధాన్యం బస్తాలతో నిండివున్న ఓ భారీ ట్రక్.. దూసుకెళ్లింది. ఈ ఘటనలో 13 మంది సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు.

ప్రమాదస్థలానికి అతి కొద్ది దూరంలోనే ఆలయం ఉంటుంది. నిజానికి.. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన ఛినోర్ మార్గంలో రాకపోకలు సాగిస్తోండటం, శీతల్ మాతా ఆలయంలో రద్దీ నేపథ్యంలో.. రాత్రివేళ భారీ వాహనాలకు అనుమతి లేదు. అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ సైతం ఏర్పాటు చేశారు. క్రాస్ బ్యారికేడ్లనూ అమర్చారు. అనుమతి లేనందున ప్రమాదానికి కారణమైన ట్రక్ ను చెక్ పాయింట్ వద్ద నిలిపివేశారు పోలీసులు.
రోడ్డు వాలుగా ఉండటం వల్ల ఈ వేకువ జామున 1:30 గంటల సమయంలో ఒక్కసారిగా లారీ ముందుకు సాగింది. బ్యారికేడ్లను తొక్కుకుంటూ భక్తులపై దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డంతా భక్తులతో నిండిపోయి ఉంది. డ్రైవర్ లేకుండా ట్రక్ దూసుకుని రావడంతో దాన్ని ఎవ్వరూ కూడా అదుపు చేయలేకపోయారు. నేరుగా ఆలయం ప్రహరీగోడను ఢీ కొట్టి ఆగిపోయింది. దీంతో ఈ మార్గం మొత్తం రక్తసిక్తమైంది. భక్తుల హాహాకారాలతో నిండిపోయింది.
గ్వాలియర్ జిల్లా కలెక్టర్ రుచిక చౌహాన్, ఎస్ఎస్పీ ధరమ్ వీర్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను సమీక్షించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమించడంతో గ్వాలియర్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాలుగా ఉన్న ప్రదేశంలో లోడెడ్ ట్రక్ ను నిలిపిఉంచడం వల్ల అది అదుపు తప్పి.. పల్లపు ప్రదేశం వైపు దూసుకెళ్లిందని, దీనికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు ధరమ్ వీర్ సింగ్ తెలిపారు.












Click it and Unblock the Notifications
