ఏబీ ఎంట్రీతో మారిపోయిన బెజవాడ మేయర్ లెక్కలు-ఆ ఇద్దరికీ కష్టాలేనా?
ఏపీలో జరుగుతున్న పట్టణ స్దానిక సంస్థల ఎన్నికల్లో కొత్త కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. పలు చోట్ల ఇప్పటివరకూ అధికార, విపక్షాలు ఊహించని ఎన్నో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో అనూహ్యంగా మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ మేయర్ రేసులోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటివరకూ విజయవాడ మేయర్ రేసులోకి వచ్చిన జనసేన నేత, కూటమి అభ్యర్ధి అయిన వంగవీటి రాధ, వైఎస్సార్సీపీ అభ్యర్ధి రాయన భాగ్యలక్ష్మి మధ్యే పోటీ ఉంటుందని భావించగా.. ఇప్పుడు మూడో అభ్యర్దిగా ఏబీ వెంకటేశ్వరరావు (AB Venkateswara Rao) అడుగుపెట్టారు. ఆయనకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించారు.
విజయవాడ కుల సమీకరణాలు
కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే విజయవాడ లోక్ సభ పరిధిలో ఆ సామాజిక వర్గం కాకుండా మరో అభ్యర్ధి పోటీ చేయడానికి కూడా సాహసించరు. అలాగే పార్టీ సైతం మరో సామాజిక వర్గ అభ్యర్ధి వైపు కన్నెత్తి కూడా చూడవు. అలాగే విజయవాడ నగరంలో మాత్రం కమ్మ, కాపు సామాజిక వర్గాలు ప్రభావం చూపుతుంటాయి. సెంట్రల్ పరిధిలో బ్రాహ్మణుల ప్రభావం కాస్త ఉంటుంది. అలాంటిది ప్రధాన పార్టీలైన జనసేన కాపు సామాజిక వర్గ నేత అయిన వంగవీటి రాధాను, వైఎస్సార్సీపీ బీసీ నాయకురాలైన రాయన భాగ్యలక్ష్మికి ఛాన్స్ ఇచ్చాయి. కానీ కమ్యూనిస్టులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వరరావును నిలబెట్టగా .. వారితో పాటు జాతీయ స్ధాయిలో ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ కూడా మద్దతిచ్చింది. దీంతో త్రిముఖ పోటీలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ మొదలైంది.

కూటమి, వైఎస్సార్సీపీ లెక్కలు
విజయవాడ నగరంలో మేయర్ పదవికి గత ఎన్నికల్లోనూ కమ్మ అభ్యర్ధులే ఎక్కువగా పోటీ చేసి గెలిచారు. అయితే గత మేయర్ గా ఉన్న వైసీపీ నేత రాయన భాగ్యలక్ష్మి మాత్రం వైసీపీ ప్రభుత్వ హయాంలో అనూహ్యంగా ఇక్కడ పరోక్ష ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇప్పుడు సమీకరణాలు మారాయి. ప్రస్తుతం కూటమి తరపున నిలబడుతున్న జనసేన అభ్యర్ధి వంగవీటి రాధ కూటమి పార్టీల బలంతో పాటు స్థానిక సమీకరణాల్ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు. రాయన భాగ్యలక్ష్మి ఆమె సొంత సామాజిక వర్గమైన నగరాల ఓట్లను నమ్ముకున్నారు. వైసీపీ సంప్రదాయ వర్గాలైన ఎస్సీ, మైనార్టీ ఓట్లు కూడా ఆమెకు పడే ఛాన్స్ ఉంది. దీంతో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అందులోనూ రాధాకు ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఆయన గెలిచే ఛాన్స్ ఉందనీ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏబీ ఎంట్రీ వీరిద్దరికీ షాకిచ్చింది.

ఏబీని టాప్ లో నిలబెడుతున్నవి ఇవే..!
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఛీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు ఎంట్రీ విజయవాడలో మేయర్ ఎన్నికల సమీకరణాల్ని సమూలంగా మార్చబోతోంది. ఏబీకి పోలీసు విభాగంగా డీజీపీ స్ధాయిలో పనిచేసిన అనుభవం, పరిచయాలు ఉన్నాయి. అలాగే నూజివీడుకు చెందిన ఆయన విజయవాడకు ఎప్పటి నుంచో స్దానికుడే. ఇక్కడ నగర పోలీసు కమిషనర్ గా పనిచేసిన ఏబీకి విజయవాడలో అనుపానులన్నీ తెలుసు. అలాగే ఒకప్పుడు టీడీపీకి ఎంతో ఆప్తుడిగా మెలిగిన ఏబీకి ఆ పార్టీ నేతలతోనూ విస్తృత పరిచయాలు ఉన్నాయి. రెండేళ్లుగా ఓ ఎన్టీవో పేరుతో రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తూ ఏబీ మంచి పేరు తెచ్చుకున్నారు. చివరిగా ఆయన సామాజిక వర్గమైన కమ్మవారి ప్రభావం విజయవాడలో ఉండనే ఉంది. అలాగే ఆయన ప్రత్యర్థులు ఇతర సామాజిక వర్గాల వారు కావడం. ఇవన్నీ ఇప్పుడు ఏబీని నిలబెట్టిన ఇండియా కూటమికి ఉన్న నమ్మకం కంటే కూటమి, వైఎస్సార్సీపీలో అపనమ్మకం పెంచేస్తున్నాయి. ఇవన్నీ కలగలసి విజయవాడ మేయర్ గా ఏబీ వెంకటేశ్వరరావు అవకాశాల్ని మెరుగుపరుస్తున్నాయి.












Click it and Unblock the Notifications
