పెరిగిన ధరలపై ప్రజాగ్రహం. రొడ్డెక్కిన ఫ్రాన్స్.. 4 లక్షల మందితో మహా ధర్నా!
జీవన వ్యయం భారంగా మారడం, విద్యావ్యవస్థలో అరకొర సౌకర్యాలు, ప్రభుత్వ సేవల పతనానికి నిరసనగా ఫ్రాన్స్ దేశం అగ్నిగుండంగా మారింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే శనివారం ఒక్కరోజే సుమారు 4 లక్షల 10 వేల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. రాజధాని పారిస్‌తో పాటు లియోన్, నీస్, స్ట్రాస్బోర్గ్ వంటి ప్రధాన నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. శాంతియుతంగా ప్రారంభమైన ర్యాలీలు చివరికి దాడులు, బాష్పవాయు గోళాల ప్రయోగానికి దారితీశాయి.
పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో ప్రాన్స్ హోంశాఖ తీవ్రంగా స్పందించింది. దేశవ్యాప్తంగా దాదాపు 1,000 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేవలం పారిస్ నగరంలోనే 64 మందిని అరెస్ట్ చేయగా, అందులో ఆరుగురు మైనర్లు కూడా ఉన్నారు. అల్లర్లను అణచివేసేందుకు ప్రభుత్వం ఏకంగా 70 వేల మంది పోలీస్, మిలిటరీ బలగాలను రంగంలోకి దింపింది. పారిస్ వీధుల్లో వాటర్ క్యానన్లు, హెలికాప్టర్లు, సాయుధ వాహనాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మూతపడిన చారిత్రక మ్యూజియం..
తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పారిస్‌లోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లూవ్రే మ్యూజియం, మూసీ దార్సేలతో పాటు ప్రధాన ఒపెరా థియేటర్లను అధికారులు పూర్తిగా మూసివేశారు. 20కి పైగా మెట్రో స్టేషన్లలో రాకపోకలను నిలిపివేశారు. గతంలో జరిగిన అల్లర్లలో 3 వేలకు పైగా దుకాణాలు ధ్వంసమవ్వడంతో, ఈసారి వ్యాపారులు ముందు జాగ్రత్తగా తమ షోరూమ్‌ల కిటికీలకు చెక్క బోర్డులు కొట్టుకుని భద్రతను పెంచుకున్నారు.
అసలు ఎందుకు ఈ ఉద్యమం?
గత నెలలో పారిస్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లేమిపై విద్యార్థులు ప్రారంభించిన చిన్న నిరసన.. నేడు దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారింది. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు, పెన్షన్లు పెంచాలని కార్మిక సంఘాలు ఉద్యమంలోకి వచ్చాయి. స్కాలర్ షిప్స్ పెంచాలని, అద్దెలను నియంత్నించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతోంది.















Click it and Unblock the Notifications
