ఆ నగరం.. త్వరలో ముస్లిం సిటీ కాబోతోంది- చెయ్యి దాటింది: ట్రంప్ ఆందోళన, వార్నింగ్
ఫ్రాన్స్.. మంటలబారిన పడింది. పారిస్ సహా అనేక ప్రధాన నగరాలు తగులబడుతున్నాయి. అల్లర్లతో అట్టుడికిపోతున్నాయి. ఏకంగా 5,00,000 మందికి పైగా ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి దూసుకొచ్చి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. తీవ్రతరమౌతోన్న అసంతృప్తి, ప్రభుత్వ నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఒక్కసారిగా పెల్లుబికాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన ఈ ఆందోళనలు దేశవ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందాయి.
రాజధాని పారిస్‌తో పాటు ఫ్రాన్స్ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో సుమారు 5.5 లక్షల మందికి పైగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చి విరుచుకుపడ్డారు. అనేక చోట్ల వాహనాలకు నిప్పు పెట్టడం, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేయడం, లగ్జరీ దుకాణాలను లూటీ చేయడం.. పరిపాటిగా మారిందక్కడ. ఉపాధ్యాయుల సమ్మెకు మద్దతుగా మొదలైన ఈ ఉద్యమంలోకి కార్మిక సంఘాలు, ఎల్లో వెస్ట్ ఆందోళనకారులు సంఘీభావాన్ని ప్రకటించడంతో ఇది తీవ్రరూపం దాల్చింది.

తప్పుడు విధానాలు
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీనికి ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ అనుసరిస్తోన్న తప్పుడు వలస విధానాలే మూలకారణమని అన్నారు. పెద్ద ఎత్తున వలసదారులను అనుమతించడం వల్ల రాజధాని పారిస్ జనాభా స్వరూపమే మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాను ఇచ్చిన హెచ్చరికలను పాటించి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేవి కావని వ్యాఖ్యానించారు.
యథేచ్ఛగా రానిచ్చారు
కన్సాస్ లో ఓ బహిరంగ సభలో మాట్లాడారు ట్రంప్. రాజధాని పారిస్.. త్వరలో ముస్లిం సిటీగా రూపాంతరం చెందబోతోందని ట్రంప్ హెచ్చరించారు. ఎటువంటి కఠిన నియంత్రణలు లేకుండా ప్రపంచం నలుమూలల నుంచి అందరినీ దేశంలోకి అనుమతించి ఫ్రాన్స్ అతిపెద్ద పొరపాటు చేసిందని, అదే ఇప్పుడు ఈ పరిస్థితులకు దారి తీసిందని అన్నారు. గతంలో మేక్రాన్ తో జరిపిన సంభాషణల వివరాలను కూడా ప్రస్తావించారు.. ట్రంప్.
ఈ పరిస్థితి వస్తుందని ఎప్పుడో చెప్పా
ఇమ్మిగ్రేషన్ పాలసీల్లో కొన్ని కఠిన నిబంధనలను రూపొందించుకోవాలని మేక్రాన్ కు సూచించానని ట్రంప్ వివరించారు. ఎటువంటి నియంత్రణ లేకుండా వలసలకు గేట్లు ఎత్తడం వల్ల ఈ పరిస్థితి వస్తుందని చాలా కాలం క్రితమే చెప్పానని అన్నారు. సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేయకపోవడం వల్లే ఫ్రాన్స్ లో నగరాల జనాభా స్వరూపం మారుతోందని, అక్కడ నెలకొన్న శాంతిభద్రతల సమస్యలకు అదే కారణమని పేర్కొన్నారు.
థర్డ్ వరల్డ్ మైగ్రేషన్స్ తో ముప్పు
మూడో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న వలసదారులు పాశ్చాత్య సంస్కృతి, విలువలకు ముప్పుగా పరిణమిస్తోన్నారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఫ్రాన్స్ వంటి దేశాలు వలసదారుల వల్ల తీవ్రంగా దెబ్బ తింటోన్నాయని అన్నారు. అటువంటి పరిస్థితిని అమెరికాలో రానివ్వబోనని ట్రంప్ స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల, పటిష్టమైన ఇమ్మిగ్రేషన్ విధానాలకే తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని ఆయన పునరుద్ఘాటించారు.












Click it and Unblock the Notifications
