గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ భీకర దాడులు..! 78 మంది మృత్యువాత..!
పాలస్తీనాలోని గాజా నగరం ఆక్రమణ కోసం ఇజ్రాయెల్ ఇవాళ భారీ ఎత్తున భూతల దాడులు ప్రారంభించింది. ఇన్నాళ్లూ వైమానిక దాడులు చేస్తూనే పరిమిత స్ధాయిలో భూతల దాడులు నిర్వహించిన ఇజ్రాయెల్.. ఇవాళ మాత్రం పూర్తి స్దాయిలో భూతల దాడుల్ని చేపట్టింది. ఇందులో గాజా నగరంలో ఉన్న పౌరులు మృత్యువాత పడుతున్నారు. ఇవాళ ఒక్కరోజే దాదాపు 80 మంది పౌరులు ఈ దాడుల్లో చనిపోయారు.
గాజాపై దాడులు చేస్తామని, నగరాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ముందస్తు హెచ్చరికలు చేసింది. గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించుకునే లక్ష్యంతో భారీ ఎత్తున సైన్యాన్ని పంపిన ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు కొనసాగిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో పౌరులు గాజా నగరాన్ని విడిచి పయనం అవుతున్నారు. కొందరు ట్రక్కుల్లో, మరికొందరు నడుచుకుంటూనే గాజా నుంచి భారంగా నిష్కమిస్తున్నారు.

ఇవాళ ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ గాజా కాలిపోతోందంటూ ప్రకటించారు. నిన్న రాత్రి నుంచే మొదలైన దాడులు ఇవాళ ఉదయం కూడా కొనసాగాయని తెలిపారు. గాజా నగర ఆపరేషన్ యొక్క ప్రధాన దశ ప్రారంభమైందని, నగర శివార్ల నుండి కేంద్రం వైపు తమ దళాలు కదులుతున్నాయని రక్షణమంత్రి వెల్లడించారు. ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంలో దాదాపు 2,000 నుండి 3,000 మంది హమాస్ ఉగ్రవాదులు మిగిలి ఉన్నారని పేర్కొంది. అలాగే ఉగ్రవాద సంస్థ ఉపయోగించే సొరంగాలు కూడా ఇంకా మిగిలి ఉన్నాయని అంచనా వేస్తోంది.

ఇజ్రాయెల్ గాజాలో మారణహోమానికి పాల్పడిందని, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సహా ఇజ్రాయెల్ ఉన్నతాధికారులు ఈ చర్యలను ప్రేరేపించారని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ తేల్చిన రోజే ఈ దాడులు మొదలయ్యాయి. ఐక్యరాజ్యసమితి కమిషన్ తన నివేదికలో ఇజ్రాయెల్ మారణహోమాన్ని నిర్ధారిస్తూ హత్యల స్థాయి, పౌరులకు అడ్డంకులు, బలవంతంగా ఖాళీ చేయించడం, సంతానోత్పత్తి క్లినిక్ విధ్వంసం వంటి ఉదాహరణలను చూపింది. అయితే ఇజ్రాయెల్ ఈ రిపోర్ట్ ను తోసిపుచ్చింది.












Click it and Unblock the Notifications