H1B: మూడేళ్ల పాటు వీసాలు బంద్? సంచలన బిల్లు
అమెరికా కలలు కంటున్న భారతీయులకు, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఇది కోలుకోలేని దెబ్బ. అగ్రరాజ్యం మరోసారి తన వీసా నిబంధనలతో 'ఇండియన్ టెక్కీల' గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. అరిజోనా కాంగ్రెస్ సభ్యుడు ఎలి క్రేన్ నేతృత్వంలోని రిపబ్లికన్ చట్టసభ్యులు తెచ్చిన కొత్త బిల్లు ఇప్పుడు లక్షలాది మంది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది.
అమెరికాలోని టెక్ కంపెనీలు తక్కువ జీతాలకే విదేశీయులను తెచ్చుకుంటూ, తమ దేశ పౌరుల ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని రిపబ్లికన్ల ఆరోపణ. దీనిని అరికట్టేందుకే "ఎండ్ H-1B వీసా అబ్యూస్ యాక్ట్ ఆఫ్ 2026" అనే బిల్లును ప్రవేశపెట్టారు. ఇందులో ప్రతిపాదించిన అంశాలు వింటేనే దిమ్మతిరిగిపోతుంది.

- మూడేళ్ల పాటు వీసాలు బంద్: ఈ బిల్లు చట్టంగా మారితే, కనీసం మూడేళ్ల పాటు కొత్త H-1B వీసాల జారీని పూర్తిగా నిలిపివేస్తారు.
- కోటాలో భారీ కోత: ప్రస్తుతం ఏడాదికి ఇస్తున్న 65,000 వీసాలను ఏకంగా 25,000కు తగ్గించాలని చూస్తున్నారు.
- జీతం ఎంత ఉండాలంటే: H-1B వీసాపై అమెరికా వెళ్లాలంటే ఏడాదికి కనీసం $2,00,000 (సుమారు ₹1.67 కోట్లు) జీతం ఉండాలి. అంతకంటే తక్కువ ఇచ్చే ఉద్యోగాలకు వీసాలు ఇవ్వరు.
కుటుంబాలకు చెక్.. భారతీయులపై పెను ప్రభావం
ఈ బిల్లులో అత్యంత కఠినమైన అంశం ఏమిటంటే, H-1B వీసా ఉన్నవారు తమ భార్యాపిల్లలను (డిపెండెంట్లను) అమెరికాకు తీసుకురాకుండా నిరోధించడం. అంతేకాదు, విద్యార్థి వీసాపై ఉన్నవారు వర్క్ పర్మిట్ పొందే OPT (Optional Practical Training) విధానాన్ని కూడా రద్దు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఒకవేళ వీసా గడువు ముగిస్తే, మరో వీసా కోసం దరఖాస్తు చేయాలన్నా దేశం విడిచి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తోంది.
గ్రీన్ కార్డ్ కలపై నీలి నీడలు
ఇప్పటికే గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాలుగా వేచి చూస్తున్న లక్షలాది మంది భారతీయులు ఈ బిల్లుతో తీవ్ర ఇబ్బందుల్లో పడనున్నారు. ప్రముఖ ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాహుల్ రెడ్డి విశ్లేషణ ప్రకారం.. ఈ బిల్లు అమల్లోకి వస్తే, ప్రస్తుత H-1B హోల్డర్లు తమ హోదాను మార్చుకోలేరు. గ్రీన్ కార్డ్ కోసం పెట్టుకున్న దరఖాస్తులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వేల మంది భారతీయులు అమెరికాను విడిచి రావడమో లేక మళ్ళీ స్టూడెంట్ వీసాలకు మారడమో చేయాల్సి ఉంటుంది.
కార్పొరేట్ లాభాల కోసం కాదు.. పౌరుల కోసం!
"అమెరికా ప్రభుత్వం పనిచేసేది భారీ కార్పొరేషన్ల లాభాల కోసం కాదు.. దేశ పౌరుల కోసం" అంటూ చట్టసభ్యుడు ఎలి క్రేన్ ఘాటుగా స్పందించారు. H-1B ప్రోగ్రామ్ ఒక 'స్కామ్' అని, చౌకగా దొరికే విదేశీ కార్మికుల కోసం అమెరికన్లను బలి ఇస్తున్నారని పాల్ గోసర్ వంటి నేతలు మండిపడుతున్నారు. అమెరికన్లను అవుట్‌సోర్సింగ్ చేసే విధానానికి స్వస్తి పలకడమే ఈ బిల్లు లక్ష్యమని వారు గట్టిగా చెబుతున్నారు.
టెక్ దిగ్గజాల్లో ఆందోళన..
ఈ పరిణామం కేవలం ఉద్యోగులనే కాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలను కూడా కలవరపెడుతోంది. నిపుణులైన కార్మికులు దొరకక పనులు ఆగిపోయే ప్రమాదం ఉందని కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే, రిపబ్లికన్ చట్టసభ్యులు మాత్రం "అమెరికన్లే మా ప్రాధాన్యత" అంటూ మొండిగా ముందుకు వెళ్తున్నారు. 2026లో అమెరికా వీసా యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!














Click it and Unblock the Notifications