
ప్రపంచానికి సరికొత్త సవాల్... అల్‌ఖైదా కొత్త చీఫ్‌గా అతనే?
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీ హతమవడంతో ఆయన స్థానంలో కొత్త అధినేతగా బాధ్యతలు చేపట్టబోయేదెవరన్న ప్రశ్న ఇప్పుడు అన్నిదేశాల్లో తలెత్తింది. ప్రస్తుతం అల్ ఖైదాలో అగ్రనేతలుగా ఉన్న సైఫ్ అల్ అదెల్, యాజిద్ మెబ్రాక్, అబ్దుల్ రెహ్మాన్ అల్ మఘ్రేబీ, అల్ షబాబ్ సంస్థకు చెందిన అహ్మద్ దిరియేల పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. వీరిలో సైఫ్ అల్ అదెల్ పేరు ప్రధానంగా వినపడుతోందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దారుస్సలాం పేలుళ్లలో కీలక పాత్రధారి
సైఫ్ 1960లో ఈజిప్టులో జన్మించాడు. కరడు గట్టిన ఉగ్రవాదిగా పేరుపొందాడు. 1998లో నైరోబీ, దారుస్సలాం, టాంజానియా, కెన్యాల్లో అమెరికా రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపినవారిలో సైఫ్ కూడా ఒకడు. ఆనాటి దాడుల్లో దాదాపు 250 మందిపైగా మృత్యువాత పడ్డారు. సైఫ్ తలపై కోటి డాలర్ల రివార్డును అమెరికా ప్రకటించింది. గతంలో ఈజిప్టు సైన్యంలో కర్నల్ స్థాయి అధికారిగా విధులు నిర్వహించాడు. అల్ ఖైదాలో సైఫ్ అంటే అందరికీ గౌరవం ఎక్కువ. 2013లోనే సంస్థ పగ్గాలు చేపడతాడని వార్తలు వచ్చినపపటికీ తనంతట తానుగా రేసు నుంచి తప్పుకొని అల్ జవహరీకి మద్దతు పలికాడు.

జనాకర్షక శక్తి ఎక్కువగా ఉన్న సైఫ్
ఇతనికి జనాకర్షక శక్తి ఎక్కువ. అమెరికాతోపాటు పలు దేశాలందరికీ ఈ విషయం తెలుసు. ఒకవేళ అతడు బాధ్యతలు చేపడితే ప్రపంచవ్యాప్తంగా మరింత ఎక్కువ సంఖ్యలో ముస్లింలు అల్ ఖైదాలో చేరే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధినేతను ఎంపిక చేసుకునే విషయమై సంస్థలో ఎటువంటి నిర్ధిష్ట విధానాలు లేవు. అయితే సైఫ్ చీఫ్‌గా పగ్గాలు చేపడతారా? చివరి నిముషంలో మరెవరి పేరన్న అనూహ్యంగా తెరమీదకు వస్తుందా? అనేదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

జవహరీ కుటుంబ సభ్యుల తరలింపు
అల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా దర్యాప్తు సంస్థ సీఐఏ హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తాలిబన్ ప్రభుత్వం కూడా ధ్రువీకరించిందికానీ మృతులెవరనేది ప్రకటించలేదు. జవహరీ మృతిచెందిన తర్వాత ధ్వంసమైన ఇంటి పై భాగాన్ని హక్కానీ నెట్ వర్క్ సభ్యులు పూర్తిగా కప్పేశారు. తాలిబన్ కీలకనేతలు ఎక్కువగా ఉండే అత్యంత సురక్షిత ప్రాంతంలో ఉన్న ఇంటిపై అమెరికా దాడిచేయడాన్ని అల్ ఖైదా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జవహరీ కుటుంబ సభ్యులను వేరే ప్రాంతానికి తరలించారు.