వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోర్ముజ్: చాలామంది ప్రపంచ పర్యటకులకు తెలియని ఇంద్రధనుస్సు దీవి, తినగలిగే పర్వతం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హార్మూజ్: ప్రపంచ పర్యటకులకు తెలియని ఇంధ్రధనస్సు దీవి, తినగలిగే పర్వతం

మట్టి రంగులో ప్రవహించే వాగులు, కెంజాయ రంగు బీచులు, మనోహరమైన ఉప్పు గుహలతో ఇరాన్‌లోని హోర్ముజ్ దీవి హరివిల్లును తలపిస్తుంది.

భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఈ దీవి డిస్నీల్యాండ్ లాంటిది.

"ఇక్కడి మట్టి రుచి చూసి తీరాల్సిందే" అంటారు హోర్ముజ్ టూరిస్ట్ గైడ్ ఫర్జాద్ కే.

కెంపు రంగులో ఉన్న కొండ అంచున ఎర్రటి అలలతో పోటెత్తే సముద్రం మంత్రముగ్ధులను చేస్తుంది.

ఖనిజాలతో నిండి ఉన్న ఈ ప్రాంతం ఏదో మర్మదేశం లాగ అనిపిస్తుంది.

ఇరాన్ తీరానికి 8 కి.మీ దూరంలో, పర్షియన్ గల్ఫ్ ముదురు నీలి రంగు జలాల మధ్య కన్నీటి చుక్క ఆకారంలో ఉండే హోర్ముజ్ ఒక ఉప్పు గోపురంలా కనిపిస్తుంది.

నాపరాయి, మట్టి, ఇనుము అధికంగా ఉండే అగ్ని పర్వత శిలలతో నిండి.. ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో మెరిసిపోతూ ఉంటుంది. 70కు పైగా ఖనిజాలను ఇక్కడ గుర్తించారు. అవే ఈ రంగులకు కారణం.

ఇన్ని రంగులు, ఉప్పు గోపురాలు ఎలా ఏర్పడ్డాయి?

మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హోర్ముజ్‌లోని ప్రతీ అంగుళం దాని ఆవిర్భావం కథను చెబుతుంది.

బ్రిటిష్ జియోలాజికల్ సర్వేలో ప్రిన్సిపల్ జియాలజిస్ట్ డాక్టర్ కాథరిన్ గూడెనఫ్ హోర్ముజ్‌లోని రంగులకు కారణాలు వివరించారు. గూడెనఫ్ గతంలో ఇరాన్‌లో పనిచేశారు.

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పర్షియన్ గల్ఫ్ అంచుల చుట్టూ సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఉప్పు మందంగా పేరుకుపోయింది. ఈ ఉప్పు పొరలు క్రమ క్రమంగా అక్కడి ఖనిజ సంపన్న అగ్నిపర్వత అవక్షేపాలతో కలిసి రంగు రంగుల దిబ్బలుగా ఏర్పడ్డాయని ఆమె చెప్పారు.

"గత 50 కోట్ల సంవత్సరాల్లో అగ్నిపర్వత అవక్షేపాల ఒత్తిడి కారణంగా ఉప్పు పొరలు లోలోతులకు పాతుకుపోయాయి. కానీ, ఉప్పు తేలికగా ఉంటుంది కాబట్టి కాలక్రమేణా అది పైకి ఉబుకుతుంది. అడుగున ఉన్న ఉప్పు, పైనున్న రాళ్లను చీల్చుకుని పెల్లుబకడంతో ఉప్పు గోపురాలు ఏర్పడ్డాయి."

భూమి అడుగున కిలోమీటర్ల లోతులో పాతుకుపోయిన ఉప్పు పొరలు పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతా కనిపిస్తాయని గుడెనఫ్ చెప్పారు.

అక్కడి భౌగోళిక పరిస్థితులే మట్టి రంగు వాగులు, ఎర్రటి బీచులు, అందమైన ఉప్పు గుహలకు కారణం.

అందుకే హోర్ముజ్‌ను 'ఇంద్రధనుస్సు దీవి ' (రైన్‌బో ఐలండ్) అంటారు. వానవిల్లులో రంగులన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి.

తినగలిగే పర్వతం

దీనికి మరో విశేషం కూడా ఉంది. ఇక్కడ ఉన్న ఒక పర్వతం మట్టిని రుచి చూడవచ్చు. తినగలిగే పర్వతం ప్రపంచంలో ఇదొక్కటేనని భావిస్తారు.

ఈ పర్వతం పైనున్న ఎర్రటి మట్టిని గెలాక్ అంటారు. ఇది హేమాటైట్ అనే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఏర్పడింది. ద్వీపంలోని అగ్నిపర్వత శిలల నుంచి ఇది పుట్టుకొచ్చిందని భావిస్తారు.

ఈ విలువైన ఖనిజానికి ఎన్నో పారిశ్రామిక ప్రయోజనాలు ఉన్నాయి.

దాంతో పాటు, స్థానిక వంటకాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ గెలాక్.

కూరల్లో దీన్ని మసాలాగా ఉపయోగిస్తారు. వంటకాలకు ఇది మంచి మట్టి వాసన అద్దుతుంది.

స్థానికంగా దొరికే బ్రెడ్ 'తోమ్షి' తో పాటు తినడానికి ఇది ఎంతో రుచిగా ఉంటుందని అంటారు.

"ఈ ఎర్ర మట్టిని సాస్‌గా వాడతాం. దీన్ని సూరఖ్ అంటాం. బ్రెడ్‌పైన దీన్ని పూస్తాం. ఇది దాదాపుగా ఉడికిపోయి ఉంటుంది. వంటల్లోనే కాకుండా, స్థానిక కళాకారులు దీనిని వర్ణచిత్రాలకు రంగుగా కూడా ఉపయోగిస్తారు. డై వేయడానికి, పింగాణీ పాత్రలపై డిజైన్లకు, కాస్మటిక్స్‌లో కూడా వాడతారు" అని ఫర్జాద్ భార్య మర్యం పేకని చెప్పారు.

ఈ ఎర్ర రంగు పర్వతమే కాకుండా హోర్ముజ్‌లో చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి.

ఈ దీవికి పశ్చిమాన 'ఉప్పు దేవత' (గాడెస్ ఆఫ్ సాల్ట్) గా పిలిచే అద్భుతమైన ఉప్పు పర్వతం ఉంది.

కిలోమీటరుకు పైగా విస్తరించిన ఈ పర్వతం అంచులు చాలా పదునుగా ఉంటాయి. ఉప్పు స్ఫటికాలతో మెరిసిపోతూ, పెద్ద పాలరాతి భవనంలో స్తంభాల్లా కనిపిస్తాయి.

దీనికి వైద్య గుణాలున్నాయని స్థానికులు నమ్ముతారు. మన శరీరంలోని నెగెటివ్ ఎనర్జీని పారద్రోలుతుందని విశ్వసిస్తారు.

"ఈ రాతి ఉప్పు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. కొంతసేపు ఈ కనుమల్లో గడిపితే మనకు కొత్త ఉత్తేజం కలుగుతుంది. అందుకే దీన్ని ఎనర్జీ వ్యాలీ అంటారు" అని ఫర్జాద్ వివరించారు.

అదే విధంగా నైరుతిలో 'ఇంద్రధనుస్సు లోయ' (రైన్‌బో వ్యాలీ) ఉంది. బహుళ వర్ణాల్లో ఇక్కడి నేల మెరిసిపోతూ ఉంటుంది. ఎరుపు, ఊదా, పసుపు, నీలం రంగులలో పర్వతాలు ప్రకాశిస్తూ ఉంటాయి. సూర్య కిరణాలు తాకగానే వీటిపై కొత్త కొత్త ఆకారాలు ఏర్పడి వింతగొలుపుతాయి.

పక్కనే ఉన్న 'విగ్రహాల లోయ' (వ్యాలీ ఆఫ్ స్టాట్యూస్)లో వేలాది సంవత్సరాల గాలి కోత వలన రాళ్లు అద్భుతమైన ఆకృతుల్లోకి మారాయి. పక్షుల్లాగ, డ్రాగన్లలాగ, వింత వింతా ఆకృతుల్లో దర్శనమిస్తాయి. ప్రకృతి స్వయంగా సృష్టించిన కళారూపాలు అనిపిస్తాయి.

ఈ దీవి ఎరుపు, పసుపు, నారింజ రంగుల్లో మెరిసిపోతూ ఉంటుంది.. ఇక్కడ ఉన్న 70 ఖనిజాలే ఇందుకు కారణం

ప్రపంచ పర్యటకులకు దీని గురించి పెద్దగా తెలీదు

ఇంత అందమైన, బహుళ వర్ణాల దీవి గురించి చాలామందికి తెలీదు.

2019లో కేవలం 18,000 మంది మాత్రమే ఈ దీవిని సందర్శించారని ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ తెలిపింది.

"చారిత్రకమైన, సహజసిద్ధమైన ప్రత్యేక ఆకర్షణలున్న ఈ ప్రాంతం గురించి ఎక్కువమంది పర్యటకులకు తెలీదు. హోర్ముజ్‌లో మౌలిక సదుపాయలు మెరుగుపరిస్తే సందర్శకులకు ఇది ప్రధాన ఆకార్షణగా నిలుస్తుంది" అని ఈ దీవికి చెందిన ఎర్షద్ షాన్ అన్నారు.

స్థానికులు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఇంట్లో వండిన భోజనం అందించడం, రిక్షాలు, మోటార్ బైకుల మీద ద్వీపం చుట్టూ తిప్పి చూపించడం మొదలుపెట్టారు.

"హోర్ముజ్‌ కోసం ఇదంతా చేయడం మా బాధ్యత. ఇది ఎంతో అరుదైన ప్రదేశం. పర్యావరణ స్నేహితమైన ఈ ప్రదేశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేందుకు తక్షణ సహకారం అందించాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం" అని షాన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Hormuz: A rainbow island unknown to many world travelers, an edible mountain
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X