Joe Biden-Trump: బైడెన్ ను ఇండియాకు రాకుండా ఆపేసిన ట్రంప్ భయం ?
ఈ ఏడాది భారత్ లో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను కేంద్రం ఆహ్వానించింది. అయితే ఆయన మాత్రం ఈ వేడుకలకు వస్తానని ముందు అంగీకరించి ఆ తర్వాత ప్లేటు తిప్పేశారు. బైడెన్ ఆకస్మిక నిర్ణయం వెనుక రెండు కీలక కారణాలు కనిపిస్తుండగా.. అందులో ఒకటి డొనాల్డ్ ట్రంప్. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికవ్వాలని భావిస్తున్న బైడెన్ .. ఇప్పుడు భారత్ వెళ్లకపోతేనే మంచిదని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో అధికార డెమోక్రాట్ల అభ్యర్ధిగా బైడెన్ మరోసారి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఆయనకు పోటీగా విపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బరిలోకి దింపేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ అయితేనే బైడెన్ కు గట్టి పోటీ ఇవ్వగలరని ఓటర్లు సైతం భావిస్తున్నారు. దీంతో మరోసారి బైడెన్ వర్సెస్ ట్రంప్ పోరు అనివార్యమన్న అంచనాలున్నాయి.

రాయిటర్స్/ఇప్సోస్ పోల్ ప్రకారం ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని తేలింది. వైట్ హౌస్ లో అడుగుపెట్టేందుకు ట్రంప్ ఈసారి గట్టి పోటీ దారుగా ఉన్నారు. ఈ పోల్ లో ట్రంప్‌కు 38 శాతం మద్దతు లభించగా.. 26 శాతం మంది ఎవరికి ఓటేస్తామో తెలియదన్నారు. మరోవైపు బైడెన్ ప్రభుత్వంలో మంత్రులు, అధికారులు భారత్ లో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఇందులో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్, ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ఉన్నారు. వీరు వేర్వేరు కారణాలతో భారత్ లో పర్యటనలు చేస్తున్నారు.
మరోవైపు భారత్ లో రిపబ్లిక్ దినోత్సవం తర్వాత క్వాడ్ సదస్సు నిర్వహించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అదే సమయంలో బైడెన్ తాను రావట్లేదన్న సంకేతాలు పంపడంతో ఈ క్వాడ్ సదస్సు వాయిదా వేసేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఈ క్వాడ్ కూటమిలో భారత్ తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ సదస్సు భారత్, అమెరికాకు చాలా కీలకం. అదే సమయంలో 2019లో ట్రంప్ రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం అందినా రాలేదు. ఇప్పుడు బైడెన్ రాకపోతే ఇది రెండోసారి కానుంది. 2015లో రిపబ్లిక్ డే వేడుకలకు హాజరైన ఏకైక అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.












Click it and Unblock the Notifications