ఇజ్రాయెల్ భీకర దాడి
Israel: హమాస్, హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వస్తోన్న ఇజ్రాయెల్ మరో పురోగతిని సాధించింది. హమాస్ కమాండర్ ను మట్టుబెట్టింది. గాజాపై నిర్వహించిన వైమానిక దాడుల్లో ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. తాజా దాడుల్లో హమాస్ ఆయుధాల తయారీ కేంద్రం చీఫ్ బషర్ టబెత్ హతం అయ్యాడని తెలిపింది.
దీనిపై ఐడీఎఫ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, వారి స్థావరాలను గుర్తించి ఐడీఎఫ్ వ్యూహాత్మంగా దాడులు చేపట్టింది. హమాస్ మిలిటెంట్ల సొరంగాలను సైతం అత్యాధునిక డ్రోన్ల సహాయంతో గుర్తించింది. వాటన్నింటినీ ధ్వంసం చేసింది.

హమాస్ మిలిటెంట్ల స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలతో సహా దాదాపు 75 శిబిరాలపై ఐడీఎఫ్.. విస్తృతంగా దాడులు చేసింది. తాజా దాడులు చేపట్టడానికి గల కారణాలు వివరించింది ఐడీఎఫ్. తమ దేశ సరిహద్దు ప్రాంతాలపై మరోసారి విరుచుకుపడతామని హమాస్ హెచ్చరించినట్లు పేర్కొంది.
ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దాడిలో 115 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు అల్ జజీరా వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. మరణించిన వారిలో 92 మంది శరణార్థులు, ఇద్దరు సివిల్ డిఫెన్స్ వర్కర్లు ఉన్నట్లు తెలిపింది. మరో 200 మందికి పైగా సాధారణ పౌరులు గాయపడినట్లు పేర్కొంది.
గాజాలో కరువు తీవ్ర స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఈ దాడులు చేపట్టడం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమౌతోన్నాయని పాలస్తీనియన్ మీడియా తెలిపింది. 24 గంటల్లో 18 మంది ఆకలితో మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిందని అల్ జజీరా వెల్లడించింది.
అదే సమయంలో గాజాపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. తమపై మరిన్ని దాడులు సాగిస్తామంటూ హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఎదురుదాడులు చేపట్టామని ఐడీఎఫ్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు డేర్ ఎల్-బలా ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా కరపత్రాలను వెదజల్లింది.
మున్ముందు ఈ ప్రాంతంపై దాడులు చేపట్టే అవకాశాలు ఉన్నాయని, వెంటనే స్థానికులు తమ నివాసాలను ఖాళీ చేసి, సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాలని సూచించింది. కాగా గాజాపై ఇజ్రాయెల్ తాజా ముట్టడి పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ట్యునీషియా, ఇరాక్, టర్కి, మొరాకో, లెబనాన్, ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్‌లోని రామల్లా అంతటా నిరసనకారులు రోడ్ల మీదికి వచ్చారు.












Click it and Unblock the Notifications