Israel-Hamas: గాజాలో ప్రవేశించడానికి అనుమతి కోసం ఎదురు చూస్తోన్న ఐడీఎఫ్ దళాలు..
వందలాది ట్యాంకులు, సాయుధ ఇజ్రాయెల్ సైనికులు గాజా సరిహద్దులో కాచుకుని ఉన్నాయి. భూమి దాడి కోసం రాజకీయ, సైనిక నాయకత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. యూఎస్, యూకే ఆపరేషన్‌ను ఆలస్యం చేయమని ఇజ్రాయెల్‌ను కోరుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది. మరోవైపు బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునక్ శుక్రవారం కైరోలో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను కలుసుకున్నారు.
గాజాలోకి సహాయాన్ని అనుమతించాల్సిన అవసరాన్ని, హమాస్ మరియు ఇజ్రాయెల్ తమ సంఘర్షణలో పౌర ప్రాణనష్టాన్ని నివారించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. చర్చల సందర్భంగా సునక్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణను నివారించడం, అనవసరమైన పౌర ప్రాణనష్టాన్ని నివారించడం అత్యవసరమని పాలస్తీనాకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గాజాలో 2.3 మిలియన్ల జనాభా ఉండగా.. సగం మంది తమ ఇళ్లు విడిచి వెళ్లిపోయారు.

గాజాలో ఇజ్రాయెల్, పాలస్తీనా గ్రూప్ హమాస్ మధ్య పెరుగుతున్న వివాదాన్ని పరిష్కరించడానికి ఈజిప్ట్ శనివారం అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. కైరో శాంతి సదస్సుకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, అల్-తాన్ వంటి ప్రముఖులు హాజరుకానున్నారు.
గాజాలో ప్రస్తుతం మిలిటెంట్ల వద్ద 210 మంది బందీలుగా ఉన్నట్లు ఇజ్రాయెల్ దళం ఐడీఎఫ్ పేర్కొంది. కన్పించకుండా పోయిన వారి కోసం మిలిటరీ దర్యాప్తు కొనసాగుతోందని, ఆ తర్వాత బందీల సంఖ్య మరింత పెరగొచ్చని వివరించింది. హమాస్ నిన్న ఇద్దరు అమెరికన్-ఇజ్రాయెల్ మహిళలను విడుదల చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications