పాకిస్థాన్ కు రూ.7,500 కోట్లు సాయం చేసిన IMF.. భారత్ సంచలన నిర్ణయం
భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) సంస్థ ఏకంగా 1 బిలియన్ యూఎస్ డాలర్లు సాయం ప్రకటించింది. అంటే రూ. 7,500 కోట్లు అని అర్థం. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ధ్రువీకరించింది. అయితే IMF తీసుకున్న ఈ నిర్ణయంపై భారత్ మండిపడింది. పాకిస్థాన్.. ఆ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు ముందు లేవనెత్తింది. రుణాన్ని పాకిస్థాన్ దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఐఎంఎఫ్ లో పాకిస్థాన్ కు ఇచ్చే రుణంపై ఓటింగ్ ను భారత్ బహిష్కరించింది.
ఇక పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం ఇదే విషయంపై ఓ ప్రకటన విడుదల చేసింది. ఐఎంఎఫ్ తమకు 1 బిలియన్ యూఎస్ డాలర్లు అప్పు ఇచ్చిందని.. మేము 7 బిలియన్ యూఎస్ డాలర్లు రుణం అడగ్గా.. మొదట 1 బిలియన్ యూఎస్ డాలర్లు ఇచ్చినట్లు పేర్కొంది. ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు పాకిస్థాన్ వరుసగా మూడో రోజూ డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ, శ్రీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో భారీగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తన నివాసంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక పాకిస్థాన్ మాత్రం వరుసగా డ్రోన్ దాడులకు తెగబడుతోంది. శ్రీనగర్ విమానాశ్రయంపై డ్రోన్లతో దాడికి పాకిస్థాన్ పాల్పడింది. అయితే పాక్ డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టినట్లు పేర్కొంది. పంజాబ్ లోని ఫిరోజ్ పురాలోని జనావాసాలపై పాక్ డ్రోన్ దాడి జరిపింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇక జమ్ము డివిజన్ ఉధంపుర్ లో పూర్తిగా బ్లాక్ అవుట్ విధించారు. పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ లోనూ బ్లాక్ అవుట్ విధించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. వీధుల్లోకి రావొద్దని సూచించారు.












Click it and Unblock the Notifications