మనసు విప్పి మాట్లాడుకున్నాం: చైనాలో మోడీ
బీజింగ్: చైనా వచ్చి ద్వైపాక్షిక అంశాలపై మనసువిప్పి మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపైనా చర్చించామని, తమ పర్యటన ఉభయ దేశాల మధ్య మరింతగా స్నేహసంబంధాలు బలపడడానికి దోహదం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత, చైనా సరిహద్దుల్లో శాంతి పరిరక్షణకు ఉభయ దేశాలూ కట్టుబడి ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రధాని కేషాంగ్ చెప్పారు. సరిహద్దు సమస్యలు ఉన్నమాట నిజమే గానీ ఆ సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా కృషి చేస్తూనే మిగిలిన రంగాలలో పరస్పర సహకారానికి మరింతగా కృషి చేయాలని ఉభయులూ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది.
మోడీ పర్యటన సందర్భంగా భారత, చైనాల 24 ఒప్పందాలు కుదిరాయి. వీటి ఫలితంగా ఉభయ దేశాల మధ్యా దాదాపు రూ. 64 వేల కోట్ల మేర వాణిజ్యం పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. వివిధ రంగాలలో నైపుణ్యం అభివృద్ధి, గనులు, రైల్వే రంగాలలో పరస్పర సహాయ సహకారాలవల్ల ఉభయ దేశాలకూ ఎంతో మేలు జరుగుతుందని మోడీ వివరించారు. దేశం అభివృద్ధి కావాలంటే రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకమని ఆయన చెప్పారు.

ఉభయ దేశాల మధ్య మైత్రీ సంబంధాలను పెంచుకోవడమే గాక, ఉభయతారకంగా వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవడం కూడా తమ పర్యటనలో ముఖ్యమైన అంశంగా మోడీ భావించారు. మోడీ గురువారంనాడు చైనా పర్యటనకు వచ్చినప్పటినుంచి తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆసియాలో చైనా ప్రభావం చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే చైనా ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా, సైనిక శక్తిగా పెరుగుతుండడంతో ఆ దేశంతో మైత్రీ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి ఈ తరుణంలోనే చైనాతో ఎటువంటి విభేదాలు రాకుండా చూసుకోవాలనేది మోడీ ఉద్దేశంగా కనిపిస్తోంది.
సింగువా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. మాండరిన్ భాషలో విద్యార్ధులకు శుభాకాంక్షలు తెలిపిన మోడీ భారత, చైనాల మధ్య గల సరిహద్దు సమస్యలను ప్రస్తావించారు. అన్ని వివాదాలనూ సానుకూలంగా, పరస్పర సహకారంతో పరిష్కరించుకోవాలన్నదే భారతదేశ లక్ష్యం అని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
చైనా టూరిస్టులకు వీసాలు
చైనా పర్యాటకులకు భారత్ ఈ వీసాలు ఇస్తుందని మోడీ చెప్పారు. చైనా దేశీయులకు ఎలక్ట్రానిక్ టూరిస్టు వీసాలు వర్తింపజేయాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచంలోని దాదాపు 33 శాతం జనాభా భారతదేశానికి లేదా చైనాకు చెందిందని ఆయన అన్నారు. అయినప్పటికీ పరస్పరం పరిచయం చాలా తక్కువగా ఉందని ఆయన అన్నారు. ప్రాచీన కాలం పర్యాటకుల నుంచి మనం స్ఫూర్తి పొందాలని ఆయన అన్నారు. జ్ఢానాన్వేషణలో వారెంతో కృషి చేశారని, తద్వారా మనల్ని చైతన్యపరిచారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications