వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘జూ’లో జంతువులతో పాటు మనుషులు - ఐరోపా దేశాలలో ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఆదివాసీలను ఎలా ప్రదర్శించేవారంటే

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సారా బార్ట్‌మాన్

ఆఫ్రికా దేశాలు, ఇతర ప్రాంతాలకు చెందిన మనుషులను పట్టుకొచ్చి జంతువుల్లాగా 'జూ’లు ఏర్పాటు చేసి, ప్రదర్శించిన చరిత్ర యూరప్‌‌ వలస పాలకులకు ఉంది.

సముద్రాలను దాటి ఇతర ఖండాలకు అన్వేషణ మొదలైనప్పటి నుంచీ కొనసాగిన ఈ అమానవీయత.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వలస రాజ్యాలు కుప్పకూలే వరకూ కొనసాగింది.

పదిహేనో శతాబ్దం ఆరంభంలో ప్రస్తుత మెక్సికో ప్రాంతంలో ఉన్న ఆజ్టెక్ సామ్రాజ్యంలో 'మాక్టెజుమా జూ' నుంచి మనుషుల జూ చరిత్ర కనిపిస్తుంది.

ఆంటోనియో సొలిస్ రివడేనీరా (1610 - 1686) వంటి వారు రాసిన స్పానిష్ చరిత్ర ప్రకారం.. మాక్టెజుమా చక్రవర్తి ఏర్పాటు చేసిన ఆ జూలో పక్షులు, జంతువులు, విషజీవులతో పాటు.. ''బఫూన్లు, మరుగుజ్జులు, గూనివారు ఇతరుల''ను కూడా ప్రదర్శనకు పెట్టారు.

అప్పటికి శారీరక వైకల్యాలను అపశకునాలుగా పరిగణించేవారు. దుష్టశక్తులకు సాక్ష్యాలుగా భావించేవారు. ఆ తర్వాతి కాలంలో ఆ భావన చెరిగిపోయినా కూడా 'వైద్యపరమైన వికారుల'ను ఊరూరా తిప్పి ప్రదర్శించడం ఆ తర్వాత నాలుగు శతాబ్దాల వరకూ కూడా పశ్చిమ ప్రపంచంలో కొనసాగింది.

ఆజ్టెక్ సామ్రాజ్యంలో మాక్టెజుమా జూ వర్ణచిత్రం

పద్నాలుగో శతాబ్దం మధ్య నుంచి పదిహేడో శతాబ్దం వరకూ కొనసాగిన ఇటలీ పునరుజ్జీవం సమయంలో.. అన్ని రకాల విదేశీ జంతువులతో పాటు, మూర్లు, టార్టార్లు, ఇండియన్లు, తుర్కులు, ఆఫ్రికన్లు సహా 20కి పైగా భాషలు మాట్లాడే 'ఆటవికులు' కూడా తమ ప్రదర్శనశాలలో ఉన్నారని ఇటాలియన్ కార్డినల్ ఇప్పోలిటో డి మెడిసి గొప్పగా చెప్పుకొన్నారు.

యూరప్ ప్రజలకు భిన్నంగా ఉండే.. వారికన్నా భిన్నంగా కనిపించే, భిన్నమైన ఆచారాలు గల ఇతర ప్రాంతాల మనుషులు తన దగ్గర ఉన్నారని, వారితో పాటు శారీరక మార్పులతో పుట్టిన వారిని కూడా ప్రదర్శిస్తున్నామని చెప్పారు.

ఇలాంటి అమానవీయత కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా పశ్చిమ సమాజాల్లో కనిపించింది. విదేశీ మానవ 'నమూనా'లను పారిస్, లండన్, న్యూయార్క్, బెర్లిన్ వంటి నగరాల్లో ప్రజలకు ప్రదర్శించటానికి ఓడల్లో తరలించారు.

పంతొమ్మిదో శతాబ్దం మధ్య కాలంలో పరిశీలకుల్లో ఒక ఆసక్తిగా మొదలైన విషయం.. కొందరు పరిశోధకులు తమ జాతి సిద్ధాంతానికి భౌతిక సాక్ష్యాలను వెదకటం మొదలు పెట్టటంతో భయంకరమైన సూడోసైన్స్‌గా మారిపోయింది.

ప్రధానమైన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్లో భాగంగా 'మానవ జూ'లను ఏర్పాటు చేయటం పరిపాటిగా మారింది. ఈ జూలను సందర్శించటానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు.

సుదూర ప్రాంతాల నుంచి గ్రామాలకు గ్రామాలను తీసుకువచ్చి ఈ జూలలో ప్రదర్శించేవారు. అలా తీసుకువచ్చిన గ్రామాల నివాసులు తమ వలసపాలకుల ముందు యుద్ధనృత్యాలు, మత ఆచారాలను ప్రదర్శించేలా చేసేవారు.

1774లో ఒమాయి అనే పాలినేసియన్‌ను ఇంగ్లండ్‌కు తీసుకువచ్చి మూడో జార్జ్ చక్రవర్తి ముందు ప్రవేశపెట్టారు

'ఆఫ్రికన్ వీనస్’ సారా బార్ట్‌మన్ విషాద గాథ...

మియా లేదా ఒమాయి అనే పాలినేసియన్‌ను 1774లో కెప్టెన్ జేమ్స్ కుక్ ఇంగ్లండ్‌కు తీసుకువచ్చారు. అతడిని ప్రకృతి పరిశోధకుడు జోసెఫ్ బ్యాంక్స్.. ఇంగ్లండ్ పాలకుడు మూడో జార్జ్ చక్రవర్తి ముందు ప్రవేశపెట్టారు. అతడు చక్రవర్తి పాదాలకు మోకరిల్లాడు.

''అతడు చమత్కారి, మనోహరుడు, జిత్తులమారి'' అని రిచర్డ్ హోమ్స్ తన 'ఏజ్ ఆఫ్ వండర్స్' పుస్తకంలో రాశారు.

''అతడి విదేశీ సౌందర్యం చూసి సమాజం, ముఖ్యంగా మరింత సాహసోపేతమైన కులీన మహిళలు చాలా అబ్బురపడ్డారు'' అని వివరించారు.

దక్షిణాఫ్రికాకు చెందిన సారా బార్ట్‌మాన్‌ అనే మహిళ కథ ఈ యుగ చరిత్రలో అత్యంత విచారకరమైనది. 'హాటెన్‌టాట్ వీనస్'గా పిలిచే ఆమె 1780లో పుట్టారు. యూరప్‌లోని జాతరల్లో ప్రేక్షకుల ముందు ప్రదర్శించటానికి 1810లో లండన్‌కు ఆమెను తీసుకువచ్చారు.

ఆమెలో పిరుదులు ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే.. ఆ కాలంలో పెద్ద పిరుదులు ఫ్యాషన్‌గా ఉన్న యూరప్ ప్రజల దృష్టిలో ఆమె పిరుదులు అతిశయంగా ఉండేవి.

Moctezuma Zoo

ఈ ఆఫ్రికన్ వీనస్ పట్ల లండన్‌లో ఆకర్షణ తగ్గిపోవటంతో.. ఆమెను పారిస్‌కు తరలించారు. అక్కడ ఆమె మీద 'జాతి మావనశాస్త్రవేత్త'లు విశ్లేషణలు జరిపారు. ఆమెకు 'బబూన్ బటక్స్' ఉన్నాయని ఆ శాస్త్రవేత్తల్లో ఒకరు ఒక ప్రదర్శన జాబితాలో రాశారు.

ఈ కాలంలోనే జాతివాదం అధ్యయనం మొదలైంది.

సారా బార్ట్‌మాన్ 1815లో చనిపోయారు. కానీ ఆమెను ప్రదర్శించటం కొనసాగింది.

ఆమె మెదడు, అస్తిపంజరం, లైంగిక అవయవాలను పారిస్‌లోని 'హ్యుమేనిటీ ఆఫ్ మ్యూజియం'లో 1974 వరకూ ప్రదర్శించారు.

2002లో ఆమె అవశేషాలను దక్షిణాఫ్రికాకు తిరిగి అప్పగించారు. అక్కడ వాటిని సమాధి చేశారు.

సారా బార్ట్‌మాన్ శరీరాకృతి మీద విశ్లేషణలతో మానవ జాతుల వర్ణణ, కొలతలు, వర్గీకరణ శకం మొదలైంది. అది మానవుల్లో ఉత్తమ జాతులు, 'చెత్త’ జాతులు ఉన్నాయని చెప్పే సిద్ధాంతాలకు దారితీసింది.

మానవ జూల పోస్టర్లు

ఆఫ్రికా నుంచి గ్రామాలకు గ్రామాల తరలింపు...

ఈ కథ సామ్రాజ్యవాదం ఉచ్ఛస్థితిలో ఉన్న పంతొమ్మిదో శతాబ్దం చివర్లో, ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో పతాక సన్నివేశానికి చేరుకుంది.

అట్లాంటిక్ సముద్రానికి రెండు వైపులా.. క్రైస్తవ మతవ్యాప్తి, సాంస్కృతిక ఆధిపత్య భావనల్లో మునిగిపోయి ఉన్న ప్రేక్షకులు.. వలస ప్రాంత జీవితం గురించి అబ్బురపడేవారు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలను తరచుగా సందర్శిస్తుండేవారు.

'ఆదిమ జీవితా'న్ని వర్ణించటానికి ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల నుంచి గ్రామాలకు తీసుకొచ్చి యూరప్ దేశాల్లోని ప్రదర్శనల్లో పునఃసృష్టించేవాళ్లు.

ఈ ప్రదర్శనల్లో 'ఆదిమ జీవితా'న్ని సందర్శించిన ప్రేక్షకులు.. తమకు తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేసి వచ్చిన భావనతో తిరిగి వెళ్లేవాళ్లు.

ఈ పోకడకు ఆద్యుల్లో జర్మనీకి చెందిన కార్ల్ హాగెన్‌బెక్ అనే అడవి జంతువుల వ్యాపారి ఒకరు. ఆయన తర్వాతి కాలంలో యూరప్‌లో చాలా జూలను ఏర్పాటు చేశారు.

ఇతర ప్రదర్శనలకు భిన్నంగా.. 'విదేశీ ప్రజల'ను వారి 'సహజ పర్యావరణం'లో ఉన్నట్లుగా మొక్కలు, జంతువులతో సహా తన ప్రదర్శనలో చూపేవారు.

అలా 1874లో సమోవన్లను, సమీలను ప్రదర్శించారు. 1876లో ఈజిప్షియన్ సూడాన్ నుంచి తెచ్చిన ప్రజలతో నిర్వహించిన ప్రదర్శన యూరప్‌లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది.

''ఆటవికులను వారి సహజ స్థితి''లో చూపించాలన్న ఆయన ఆలోచన.. 1877లో పారిస్‌లోని జార్డిన్ డిఆక్లిమటేషన్ డైరెక్టర్ జఫ్రాయ్ డి సెయింట్-హిలేరీ నిర్వహించిన 'ఎత్నలాజికల్ షో'లకు స్ఫూర్తినిచ్చినట్లు కనిపిస్తోంది. ఆ 'జాతుల ప్రదర్శన'ల్లో న్యూబియన్లు, ఇనూట్లను జాఫ్రాయ్ చూపించారు.

ఆ ఏడాది ప్రేక్షకులు రెట్టింపయ్యారు. 10 లక్షల మందికి పైగా వచ్చారు.

జార్డిన్ జూలాజిక్ డిఆక్లిమేషన్‌లో 1877 నుంచి 1912 సంవత్సరాల మధ్య సుమారు 30 వరకూ 'ఎత్నలాజికల్ ఎగ్జిబిషన్‌'లు నిర్వహించారు.

అలాగే 1878లో పారిస్‌లో నిర్వహించిన ప్రపంచ జాతరలో 'బ్లాక్ విలేజెస్'ను కూడా ప్రదర్శించారు. ఫ్రాన్స్ వలస ప్రాంతాలైన సెనెగల్, టోన్కిన్, టహితి నుంచి ప్రజలు తీసుకొచ్చి ఈ ప్రదర్శనలో ఉంచారు.

ఈ ప్రదర్శనలో డచ్ (పోర్చుగీసు) వారు పెట్టిన విభాగంలో.. జావనీస్ గ్రామాన్ని తెచ్చిపెట్టారు. అందులోని 'ఆదివాసుల'తో నృత్యాలు, ఆచారాలను ప్రదర్శింపజేశారు.

టెహూల్చీ, షెల్నామ్, కావేస్కార్ ఇండియన్లు అరుదైన ప్రజలు.

ఇక దాదాపు 400 మంది ఆదివాసీ ప్రజలను ప్రదర్శించిన 1889 ప్రపంచ జాతరను 2.8 కోట్ల మంది సందర్శించారు. ఆ ఆదివాసీల్లో జావనీస్ ప్రజలు ప్రదర్శించిన సంగీతం.. అప్పటికి యువ సంగీతకారుడిగా ఉన్న క్లాడ్ డిబుస్సీకి నోటమాట రాకుండా చేసింది.

అదే సంవత్సరం చిలీ ప్రభుత్వ అనుమతితో షెల్నామ్ లేదా ఓమా ప్రజలు 11 మందిని యూరప్‌లో మానవ జూలలో ప్రదర్శించటానికి ఓడల్లో తరలించారు. ఆ 11 మంది ఆదివాసీల్లో 8 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

పటాగోనియాకు చెందిన టెహూల్చీ, షెల్నామ్, కావేస్కార్ ఇండియన్లు అరుదైన ప్రజలు. అందువల్ల 1878 నుంచి 1900 సంవత్సరాల మధ్య వారిని ఫొటోలు తీసుకోవటం, కొలతలు వేయటం, బరువులు తీయటంతో పాటు.. వారిచేత ప్రతి రోజూ బలవంతంగా ప్రదర్శనలు ఇప్పించేవారు.

దక్షిణ అమెరికా ఖండానికి చెందిన ఈ 'నమూనా' ప్రజల్లో సుదీర్ఘ ఓడ ప్రయాణాన్ని తట్టుకుని బతికిన వారు.. యూరప్‌లోని గమ్యాలకు చేరిన కొద్ది కాలానికే చనిపోయేవారు.

షెల్నామ్ ప్రజలను బంధించిన మారీస్ మైత్రి వంటి డీలర్లు.. ఈ రకమైన మానవ అక్రమ రవాణాతో సంపన్నులయ్యారు.

సెయింట్ లూయీ ఇగోరాట్ ప్రదర్శన

హిందూ రోప్-డ్యాన్సర్లు.. జులు యుద్ధవీరులు...

హిందూ రోప్-డ్యాన్సర్లు, అరేబియన్ ఒంటె కాపరులు, జులు యుద్ధవీరులు, న్యూ కాలిడోనియా వేటగాళ్లు అని చెప్తూ.. ఆయా ప్రాంతాల ప్రజలను పట్టుకొచ్చి ప్రదర్శించేవాళ్లు.

అలాంటి ప్రదర్శనకారుల్లో చాలా ప్రముఖుడైన వ్యక్తి 'బఫలో బిల్' కోడీ. అతడు నిర్వహించిన 'వైల్డ్ వెస్ట్' ప్రదర్శనలు జాతిపరమైన మూసవర్ణనలకు మరో ఉదాహరణగా చెప్తారు.

ఈ ప్రదర్శనల్లో దాదాపు 35,000 మంది పాల్గొన్నారని, వారిలో ఎక్కువ మందికి డబ్బులు చెల్లించి ప్రదర్శనలకోసం రప్పించారని చెప్తుంటారు.

ఇక ట్రూమన్ హంట్ ఆధ్వర్యంలోని 'విలేజ్ ఆఫ్ ఇగోరాట్స్' ప్రదర్శన అమెరికాలో విపరీతమైన క్రేజ్‌ను సృష్టించింది.

కోనీ ఐలండ్ మానవ జూలో ఇగోరాట్ బాలిక

ఫిలిప్పీన్స్ నుంచి వేర్వేరు తెగలకు చెందిన ఆదివాసీలను 1904లో సెయింట్ లూయీలో నిర్వహించిన వరల్డ్ ఫెయిర్‌కు అమెరికా ప్రభుత్వం తీసుకువచ్చింది. వారిలో కొందరిని 'విలేజ్ ఆఫ్ ఇగోరాట్స్'లో ఉంచారు.

ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశం రాజకీయమైనదని 'ది లాస్ట్ ట్రైబ్ ఆఫ్ కోనీ ఐలండ్' పుస్తక రచయిత క్లారీ ప్రిటైస్ చెప్తారు.

ఆ 'ఆటవికుల'ను ప్రదర్శించటం ద్వారా ఫిలిప్పీన్స్‌లో తన విధానాలకు ప్రజల మద్దతు పొందవచ్చునని ప్రభుత్వం భావించింది. కొత్తగా సంపాదించుకున్న వలస ప్రాంతాల నివాసులు స్వయం పాలనకు ఏమాత్రం సంసిద్ధంగా లేరని చూపటం ప్రభుత్వ లక్ష్యం.

ఈ 'ఆదివాసీలు' తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించినందుకు గాను ఒక్కొక్కరికి నెలకు 15 డాలర్లు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

అయితే ట్రూమన్ హంట్ ఈ ఇగోరాట్ల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు. వారి వేతనాల నుంచి ఆయన 9,600 డాలర్లు దోచుకున్నాడని, ఆ ఆదివాసీలు తమ హస్తకళా వస్తువులను విక్రయించటం ద్వారా సంపాదించిన డబ్బును కూడా బలవంతంగా దోచుకున్నారని ఆరోపిస్తూ ఆయనను 1906లో అరెస్ట్ చేశారు.

ఒటా బెంగా

ఆత్మహత్య చేసుకున్న పిగ్మీ ఒటా బెంగా...

ఇదేవిధంగా.. 1906లో కాంగొలీస్ పిగ్మీ అయిన ఒటా బెంగాను న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో.. కోతులు, ఇతర జంతువులతో పాటు ప్రదర్శించారు.

ఒటా బెంగాను ఒక ఒరాంగుటాన్‌తో కలిపి ఒక బోనులో పెట్టి.. 'ది మిస్సింగ్ లింక్' అని శీర్షిక పెట్టారు. మానవ పరిణామంలో యూరోపియన్ల కన్నా ఒటా బెంగా వంటి ఆఫ్రికన్లు కోతులకు మరింత సన్నిహితులని చెప్పటం ఆ శీర్షిక ఉద్దేశం.

ఆఫ్రికన్ - ఆమెరికన్ బాప్టిస్ట్ చర్చి నిరసన తెలుపటంతో.. ఒటా బెంగా ఆ జూలో స్వేచ్ఛగా తిరగటానికి అనుమతి ఇచ్చారు. అయితే.. సందర్శకులు అతడిని మాటలతో, చేతలతో వేధించటంతో అతడి ప్రవర్తన కొంచెం హింసాత్మకంగా మారింది. దీంతో జూ నుంచి అతడిని తొలగించారు.

1916లో ఒటా బెంగా తన గుండెలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

'ఆదివాసీల'కు 'నాగరికుల'కు మధ్య 'తేడాల'ను చూపే పేరుతో ఇతర ప్రాంతాలకు చెందిన మనుషులను తీసుకొచ్చి ప్రదర్శించటం ఆ తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. హాంబర్గ్, కోపెన్‌హాగెన్, బార్సిలోనా, మిలాన్, వార్సా తదితర ప్రాంతాల్లో ఇవి సాగాయి.

మార్సీలెస్ (1906 నుంచి 1922 వరకు), పారిస్‌ (1907 నుంచి 1931 వరకు)లలో హ్యూమన్ జూ ప్రదర్శనలు కొనసాగాయి. అక్కడ మనుషులను బోనుల్లో ఉంచి ప్రదర్శించారు. వారి శరీరాలు నగ్నంగా, అర్థనగ్నంగా ఉండేవి.

1931లో ఆరు నెలల్లో 3.4 కోట్ల మంది ఈ ప్రదర్శనలను చూశారు.

1931 పారిస్ కలొనియల్ ఎగ్జిబిషన్ పోస్టర్

మానవ జూలను మొదట నిషేధించింది అడాల్ఫ్ హిట్లర్...

అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ జాతుల ప్రదర్శనలు క్రమంగా అంతరించాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి అమానవీయమైన మానవ జూలను మొట్టమొదటిగా నిషేధించింది జర్మనీ పాలకుడైన అడాల్ఫ్ హిట్లర్.

విచారకరమైన విషయం ఏమిటంటే ఇతర ప్రాంతాల్లో మానవ జూలను నిషేధించాల్సిన అవసరం లేదు. ఇది నైతికంగా సరైన పనేనా అనే ఆత్మపరిశీలనలు జరగలేదు. కొత్త తరహా వినోద రూపాలు వెల్లువెత్తటంతో జనం ఈ మానవ జూలను పట్టించుకోవటం మానేశారు. దీంతో ఇవి క్రమంగా మూతపడుతూ వచ్చాయి.

అలా చిట్టిచివరిగా మూతపడిన మానవ జూ బెల్జియంలోనిది.

బెల్జియం పాలకుడు రెండో లియొపాల్డ్ తన రాజభవనంలో ప్రదర్శించటం కోసం 1897లో 267 మంది కాంగోలీస్‌ను బ్రసెల్స్‌కు దిగుమతి చేసుకున్నాడు.

వారిలో చాలా మంది చలికాలంలో చనిపోయారు. అయితే వీరిపట్ల జనంలో విపరీతమైన ఆకర్షణ పెరగటంతో అక్కడ ఒక ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశారు.

యుద్ధానంతర సామాజిక, సాంస్కృతిక, సాంకేతిక పురోగతిని సెలబ్రేట్ చేసుకుంటూ 1958లో బ్రెసెల్స్‌లో 200 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. బ్రసెల్స్ ఇంటర్నేషనల్ అండ్ యూనివర్సల్ ఎగ్జిబిషన్‌లో కాంగోలీస్ గ్రామాన్ని స్థాపించారు.

అందులోని కాంగోలీస్ చుట్టూ కట్టిన వెదురుబొంగుల దడికి అవతలి నుంచి సందర్శకులు వీక్షించేవారు. వారి కేకలు, అరుపులకు కాంగోలీస్ స్పందించకపోతే, వారి మీద 'నాణేలు, అరటిపండ్లు' విసిరేవారని ఆ సమయంలో ఒక జర్నలిస్ట్ రాశారు.

తమను ఉంచిన పరిస్థితులు, సందర్శకుల నుంచి వేధింపులకు ఆ కాంగొలీస్ జనం విసిగిపోయారు. దీంతో ఆ మానవ జూ మూతపడింది.

అది చివరి మానవ జూగా చరిత్రలో నిలిచింది. దాదాపు 140 కోట్ల మంది జనం ఈ మానవ జూలను సందర్శించినట్లు అంచనా. ఆధునిక జాతివివక్షా వాదంలో ఈ జూలు కీలక పాత్ర పోషించాయని విశ్లేషకులు చెప్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
In the 'Zoo' people along with the animals - how the African, Asian and American aborigines were displayed in the European countries
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X