వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా తీరు మారదా?: పాక్‌కు యుద్ధవిమానాలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ పట్ల అమెరికా వైఖరిలో ఏమాత్రం మార్పులేనట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇది మరోసారి రుజువైంది. అణ్వాయుధ సామర్థ్యం గల ఎనిమిది ఎఫ్-16 ఫైటర్ జెట్ విమానాలను పాకిస్థాన్‌కు అమ్మాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, 700 మిలియన్ డాలర్ల విలువైన ఈ అమ్మకాలపై అమెరికన్ కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత రావచ్చని భావిస్తున్నారు. భారత్ కూడా ఈ నిర్ణయం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇటు రిపబ్లికన్, అటు డెమొక్రాటిక్ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికీ పాకిస్థాన్‌కు ఎఫ్-16 తరహాలోని బ్లాక్-52 విమానాలను అమ్మాలని నిర్ణయించినట్టు అమెరికా విదేశాంగ శాఖ తమ దేశ చట్టసభ (కాంగ్రెస్)కు సమాచారమందించింది.

ఎనిమిది విమానాలతోపాటు వాటి పరికరాలు, శిక్షణ, ఇతర వ్యూహాపరమైన మద్దతును అందించనున్నామని పేర్కొంది. మొత్తం అమ్మకాల విలువ 699.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4.476లక్షల కోట్లు) ఉంటుందని పెంటగాన్‌లోని డిఫెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

India miffed at US decision to sell F-16 fighter jets to Pakistan

దక్షిణాసియాలో తమ వ్యూహాత్మక భాగస్వామికి కల్పిస్తున్న భద్రతను మరింత మెరుగుపరచాలనే తమ విదేశాంగ విధానంలోని నిబంధనలకు, జాతీయ భద్రత లక్ష్యాలకు అనుగుణంగా ఈ అమ్మకాలు జరుపుతున్నట్లు వివరించింది.

తమ అమ్మకాల వల్ల వర్తమాన, భవిష్యత్ ముప్పును ఎదుర్కోవడంలో పాకిస్థాన్ సామర్థ్యం పెంపొందగలదని పేర్కొంది. ఈ ఎఫ్-16 విమానాలు అన్ని వాతావరణ పరిస్థితుల్లో, ఎటువంటి వెలుగులోనైనా లక్ష్యాన్ని చేరుకోగలవు. తమ నిర్ణయానికి చట్టబద్ధత లభించాల్సి ఉందని, అమ్మకాలు జరిగిపోయాయని భావించరాదని డిఫెన్స్ సెక్యూరిటీ ఏజెన్సీ స్పష్టం చేసింది.

అయితే ఒబామా ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు శాసనకర్తలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని 30 రోజుల వ్యవధిలో కాంగ్రెస్ ఆమోదించాలి. సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైతే అమ్మకాల ప్రక్రియ కొంత ఆలస్యమై క్లిష్టతరం కావచ్చు. కానీ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చునని అంటున్నారు.

సాధారణంగా చట్ట సభ నాయకులు, ప్రభుత్వ యంత్రాంగం కలిసి ఆయుధాల అమ్మకాలపై నిర్ణయం తీసుకుంటాయి. అందువల్ల కొందరు సభ్యులు వ్యతిరేకించినా పాక్‌కు ఎఫ్-16 విమానాల అమ్మకానికి కాంగ్రెస్ మద్దతు తెలుపవచ్చని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒబామా సర్కార్ నిర్ణయాన్ని విదేశాంగ వ్యవహారాల శాఖ ఆసియా, పసిఫిక్ సబ్‌కమిటీ చైర్మన్ మాట్ సాల్మన్ వ్యతిరేకించారు.

పాకిస్థాన్ సైన్యంలో చాలామందికి ఉగ్రవాద హింసలో భాగస్వామ్యం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న పరిస్థితుల్లో ఆ దేశ మిలిటరీకి కీలకమైన ఎఫ్-16 విమానాలను అందించడం సమస్యలను సృష్టించవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

అణ్వాయుధ సామర్థ్యం గల ఎఫ్-16 విమానాలను నడిపే సామర్థ్యం పాక్ సైన్యానికి లేదన్నారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పాక్ సైన్యం చేతిలో ఇటువంటి ఆయుధం ఉండటం అవసరమని విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. తన పేరు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

భారత్ అసంతృప్తి: రాయబారి రిచర్డ్‌వర్మకు సమన్లు

పాకిస్థాన్‌కు ఎఫ్-16 విమానాలను విక్రయించాలన్న అమెరికా నిర్ణయం పట్ల భారత్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మను పిలిపించి తమ అసంతృప్తిని, మనోవేదనను వెల్లడించింది. ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికారులు సుమారు 45 నిమిషాలపాటు రిచర్డ్ వర్మతో తమ కార్యాలయంలో భేటీ అయ్యారు.

అమెరికా నిర్ణయం భారత వ్యతిరేక కార్యకలాపాలకు దోహదపడగలదని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకే విమానాల విక్రయం అన్న అమెరికా నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని తెలిపారు. ఇందుకు గత అనుభవాలే నిదర్శనమని వారు గుర్తు చేశారు. పాక్‌కు ఎవరు ఏ ఉద్దేశంతో ఎటువంటి ఆయుధ సాయం చేసినా అందుకు భారత్ బాధితురాలైందని తెలిపారు.

English summary
India has expressed its disappointment with the decision of the Obama administration to notify the sale of F-16 fighter jets to old NATO ally Pakistan which has became a breeding ground for terrorists like Hafiz Mahammad Saeed, Zakiur Rehman Lakhvi, Mullah Omar and David Headley.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X