ప్రపంచంలోనే రెండో దేశంగా భారత్.. పాకిస్థాన్ గుండెల్లో గుబులు..!!
భారత్ మరో మైలురాయిని చేరుకుంది. 2021-2025 మధ్యకాలంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న రెండో దేశంగా భారత్ నిలిచింది. ఈ దిగుమతుల్లో అధిక వాటా రష్యా నుంచే వచ్చిందని స్వీడిష్ థింక్ ట్యాంక్ సంస్థ SIPRI (స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) సోమవారం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇక ఈ జాబితాలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉక్రెయిన్ ఉంది. ప్రపంచదేశాల్లోని మొత్తం ఆయుధ బదిలీల్లో 9.7 శాతం ఉక్రెయిన్ కే చేరడం గమనార్హం. మరోవైపు, దేశీయ ఉత్పత్తి పెరుగుదల కారణంగా చైనా 1991-1995 తర్వాత మొదటిసారి టాప్ 10 ఆయుధ దిగుమతిదారుల జాబితా నుండి నిష్క్రమించింది.
మరోవైపు యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. 2021-2025లో అన్ని అంతర్జాతీయ ఆయుధ బదిలీల్లో 42 శాతం అమెరికా నుంచే జరిగాయి. 2016-2020లో 36 శాతంగా ఉండేది. ఇది గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఆసియా, ఓషియానియా ప్రాంతంలో భారత్, పాకిస్తాన్, జపాన్, ఆస్ట్రేలియా నాలుగు దేశాలు 2021-2025 మధ్య ప్రపంచంలోని పది అతిపెద్ద ఆయుధ దిగుమతి దారులుగా ఉన్నాయి. ప్రాంతీయ దిగుమతుల్లో అమెరికా వాటా 35 శాతంగా ఉండగా, రష్యా 17 శాతం, చైనా 14 శాతం వంతున సరఫరా చేశాయి.
భారత్ ఆయుధ దిగుమతులు 2016-2020 అలాగే 2021-2025 మధ్య స్వల్పంగా నాలుగు శాతం తగ్గాయి. రష్యా.. భారత్ కు ప్రధాన సరఫరాదారుగా ఉన్నప్పటికీ, దాని వాటా 2021-2025లో 40 శాతానికి పడిపోయింది. ఇది గతంలో 51 శాతం (2016-20) అలాగే 70 శాతం (2011-15) కంటే తక్కువ కావడం గమనార్హం. భారత్ ఇప్పుడు పాశ్చాత్య సరఫరాదారుల వైపు మొగ్గు చూపుతోంది. రష్యా ప్రధాన సరఫరాదారుగా ఉన్నప్పటికీ, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి దేశాల నుండి కూడా సైనిక హార్డ్‌వేర్‌ను భారత్ కొనుగోలు చేస్తోంది. ఇక పాకిస్తాన్ ఆయుధ దిగుమతులు 2016-2020, 2021-2025 మధ్య 66 శాతం పెరిగాయి. ఈ కాలంలో పాకిస్తాన్ దిగుమతుల్లో 80 శాతం చైనా నుంచే జరిగాయి. అంతకుముందు 2016-2020లో ఇది 73 శాతంగా ఉంది. చైనాపై పాకిస్తాన్ ఆధారపడటం మరింత పెరిగింది.

SIPRI ఆయుధ బదిలీల కార్యక్రమం డైరెక్టర్ మాథ్యూ జార్జ్ మాట్లాడుతూ "ఆసియా, ఓషియానియా, మధ్య ప్రాచ్యాల్లో ఉద్రిక్తతల కారణంగా పెద్ద ఎత్తున ఆయుధ దిగుమతులను కొనసాగించగా, యూరోపియన్ దేశాలకు ఆయుధ ప్రవాహంలో భారీ పెరుగుదల మొత్తం ప్రపంచ ఆయుధ బదిలీలను దాదాపు 10 శాతం పెంచింది" అని తెలిపారు. ఇక మొత్తం మీద, 2016-2020, 2021-2025 మధ్య ప్రపంచ దేశాల్లో ప్రధాన ఆయుధాల బదిలీలు 9.2 శాతం పెరిగాయి. యూరోపియన్ దేశాలు తమ ఆయుధ దిగుమతులను మూడింతలు పెంచుకున్నాయి. అమెరికా మొత్తం ఎగుమతులు 27 శాతం పెరిగాయి. యూరోప్ ఆయుధ ఎగుమతులు 21.7 శాతం పెరిగాయి.












Click it and Unblock the Notifications