భారత్-అమెరికా 'ట్రేడ్ డీల్'కు గ్రీన్ సిగ్నల్? పడిపోనున్న యూఎస్ టారిఫ్స్!
India-America: భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఈ విషయంపై దృష్టి సారించింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే కొన్ని అంశాల కారణంగా ఇప్పటికీ ఈ ఒప్పందం కుదరలేదు. వీటిలో వ్యవసాయం, డైరీ ఉత్పత్తులు, అలాగే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి.
ప్రధాన మోదీ ఈ విషయంలో స్ఫష్టత ఇచ్చారు. ఇండియా రైతులు, డైరీ రైతులకు అన్యాయం జరగనివ్వనని.. భారత్ రష్యా నుంచి చములు కొనుగోలును కొనసాగిస్తోందన్నారు. అయితే ఈ లోపు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఓ కీలక అప్‌డేట్ వెలువడింది. భారత్, అమెరికా వాణిజ్య బృందాల మధ్య ఇప్పటికే అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. తాజాగా వెలువడిన మీడియా నివేదిక ప్రకారం.. రెండు దేశాలు వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ విషయంపై భారత్ లేదా అమెరికా నుంచి అధికారిక ప్రకటన ఏదీ రానప్పటికీ.. ఈ ఒప్పందం గురించి తెలిసిన వర్గాలు మాత్రం భారత్, అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెబుతున్నాయి.

టారిఫ్ తగ్గి 15-16% కావచ్చు..
మీడియా నివేదికల ప్రకారం.. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే, టారిఫ్‌లపై కూడా ప్రభావం పడుతుంది. ఈ డీల్ తర్వాత ఇండియాపై అమెరికా విధించే టారిఫ్ 50 శాతం నుంచి తగ్గి 15-16 శాతం వరకు ఉండవచ్చు. సుంకాలే రెండు దేశాల సంబంధాలలో విభేదాలకు ప్రధాన కారణం కావడం గమనార్హం. అమెరికా గనుక ఇండియాపై సుంకాలను తగ్గిస్తే.. రెండు దేశాల సంబంధాలు మరోసారి సరైన మార్గంలోకి వచ్చి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.
రష్యా చమురు కొనుగోలుపై ఎంత ప్రభావం పడుతుంది?
డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇండియాను రష్యా నుంచి చమురు కొనవద్దని పలుమార్లు హెచ్చరించారు. ఇప్పుడు ట్రంప్.. "భారత్ రష్యా నుండి చమురు కొనుగోలును ఆపేస్తుందని ప్రధాని మోదీతో తాను మాట్లాడాను" అని పదే పదే అంటున్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసే విషయంపై ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఇండియా స్పష్టం చేసింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంలో ఇండియా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వాణిజ్య ఒప్పందం వల్ల రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై ఎంత ప్రభావం పడుతుందో వేచి చూడాలి.
డిసెంబర్‌లో పుతిన్ భారత పర్యటన
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్‌లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన, ప్రధాని మోదీ చమురు కొనుగోలుతో సహా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి అనేక కీలకమైన అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రభావం చూపుతుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications