ఇలాంటి తల్లి పగవాడికీ ఉండకూడదు..!
మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది ఓ తల్లి. భర్తతో విభేదాలు ఉన్నాయన్న కారణంతో కన్న బిడ్డనే కిరాతకంగా హత్య చేసింది. కన్నతల్లే కాలయముడిగా మారి ఆ చిన్నారిని కడతేర్చింది. అభంశుభం తెలియని ఆ చిన్నారిని విహారయాత్రకు అని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి కొంచమైనా కనికరం లేకుండా అక్కడే కత్తితో గొంతుకోసి చంపేసింది. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉంది.
విహార యాత్రకని తీసుకెళ్లి కుమారుడిని కడతేర్చింది భారత సంతతి మహిళ. ఈ హృదయ విషాదకరమైన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. భారత సంతతికి చెందిన 48 ఏళ్ల సరితా రామరాజు తన భర్త ప్రకాశ్ రాజుతో 2018లో విడాకులు తీసుకుంది.ప్రస్తుతం వర్జీనియాలో ఒంటరిగా ఉంటోంది. కుమారుడు తండ్రి వద్ద పెరుగుతున్నాడు. అయితే విడాకుల సమయంలో అప్పుడప్పుడు కుమారుడ్ని కలవొచ్చని తల్లికి కోర్టు స్పష్టం చేసింది.

అయితే ఇటీవల తన కుమారుడిని కలిసేందుకు కాలిఫోర్నియాలోని శాంటా అనాలో ఓ హోటల్‌లో రూమ్ తీసుకుంది సరితా రామరాజు. కుమారుడ్ని డిస్నీల్యాండ్ తీసుకెళ్తానని మాయమాటలు చెప్పింది. మార్చి 19న బాలుడ్ని తిరిగి తన తండ్రికి అప్పగించాల్సి ఉండగా.. అదే రోజు ఉదయం స్థానిక పోలీసులకు ఫోన్ చేసి, తాను తన కుమారుడిని చంపి, ఆత్మహత్య చేసుకోనున్నట్లు వెల్లడించింది. వెంటనే షాక్ తిన్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు.
బాలుడ్ని చంపి సరితా రామరాజు మత్తు గోలీలు మింగినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించామన్నారు. ఘటనా స్థలిలో హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితురాలు కోలుకున్నాక పూర్తి స్థాయిలో విచారిస్తామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications