పాలక్ పనీర్ కు వివక్ష.. రూ.1.8 కోట్లు ఫైన్ వేసిన కోర్ట్
అది సాధారణ లంచ్ బ్రేక్. మైక్రోవేవ్‌లో భోజనం వేడి చేసుకోవాలన్న చిన్న ఆలోచన వారిది. కానీ అదే సంఘటన ఇద్దరు భారతీయ విద్యార్థుల జీవితాలను మలుపు తిప్పింది. అమెరికాలోని అగ్ర విశ్వవిద్యాలయంలో ఎదురైన జాతి వివక్ష మరోసారి తెల్ల జాతి అహంకారాన్ని గుర్తు చేసింది. పాష్ కల్చర్ ఉండే అగ్రరాజ్యంలో జరుగుతున్న అవమానలపై భారతీయ విద్యార్ధుల న్యాయ పోరాటానికి దారి తీసింది. రెండేళ్ల పాటు సాగిన న్యాయపోరాటంలో చివరకు వారు విజయం సాధించారు. ఫలితంగా వారికి ఏకంగా 2 లక్షల డాలర్ల (దాదాపు రూ.1.8 కోట్లు) పరిహారం లభించింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఆదిత్య ప్రకాశ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఊర్మి భట్టాచార్య.. వీరిద్దరూ 2022లో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలో పీహెచ్‌డీ కోసం రీసెర్చ్ ప్రారంభించారు. అయితే 2023 సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఒక ఘటన వారి విద్యా జీవితాన్నే తారుమారు చేసింది. స్టాఫ్ క్యాంటీన్‌లో పాలక్ పనీర్‌ను వేడి చేసుకునేందుకు వెళ్లిన ఆదిత్యను అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. "ఈ ఆహారం నుంచి భరించలేని వాసన వస్తోంది, ఇక్కడ వేడి చేయొద్దు" అంటూ నిరాకరించారు. ఈ మాటలు ఆదిత్యను తీవ్రంగా కలచివేశాయి.

ఈ ఘటనపై ఆదిత్య, ఊర్మి కలిసి యూనివర్సిటీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. కానీ అటువైపు నుంచి స్పందన రాలేదు. ఆ తర్వాత కూడా ఆసియా ఆహారంపై వివక్షపూరిత వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. ఊర్మిని కారణం చెప్పకుండా టీచింగ్ అసిస్టెంట్ బాధ్యతల నుంచి తొలగించడం, వారి మాస్టర్స్ డిగ్రీలను ఇవ్వడానికి విశ్వవిద్యాలయం నిరాకరించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది
దీంతో చివరకు ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొలరాడో డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు. విచారణ ప్రారంభమైన తర్వాత యూనివర్సిటీ వెనక్కి తగ్గింది. కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు అంగీకరించి, ఇద్దరు విద్యార్థులకు కలిపి 2 లక్షల డాలర్ల పరిహారం, అలాగే వారి మాస్టర్స్ డిగ్రీలను మంజూరు చేయడానికి ఒప్పుకుంది. దీంతో రెండేళ్ల న్యాయపోరాటానికి ముగింపు పలికింది.
ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడానికి కారణం ఊర్మి భట్టాచార్య చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్. "తినే ఆహారం విషయంలో స్వేచ్ఛ కోసం కూడా పోరాడాల్సి వచ్చింది. ఇది కేవలం భోజనం గురించి కాదు... మన ఆత్మగౌరవం గురించి" అంటూ ఆమె రాసిన మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. పరిహారం సాధించడమే కాదు, తలెత్తుకుని స్వదేశానికి తిరిగొచ్చామన్న ఆమె వ్యాఖ్యలు ఎంతోమందిని ఆకట్టుకున్నాయి.
ఒక చిన్న వంటకం నుంచి మొదలైన ఈ పోరాటం, అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల హక్కులపై పెద్ద చర్చకు దారితీసింది. వివక్షకు తలవంచకుండా న్యాయబాట పట్టితే న్యాయం సాధ్యమేనన్న సందేశాన్ని ఆదిత్య, ఊర్మిల కథ బలంగా చాటుతోంది.












Click it and Unblock the Notifications