ICC:పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసిన కోర్టు ఎలా పనిచేస్తుంది, చరిత్ర ఏంటి..?
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రెండు దశాబ్దాల క్రితం అంటే 2002లో ఏర్పాటు అయ్యింది. యుద్ధ నేరాలు, మనుషులపై నేరాలు, నరమేధం, దురాక్రమణ నేరాలను విచారణ చేసేందుకు ఈ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది.
నార్వే: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు (vladamir Putin) అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌కు చెందిన చిన్నపిల్లలను బలవంతంగా, అక్రమంగా రష్యాకు ఎత్తుకెళ్లారన్న ఆరోపణలపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)ఈ అరెస్టు వారెంట్‌ను జారీ చేసింది. అయితే ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యాకు చిన్నారులను అక్రమంగా తరలించారన్న అనుమానంతోనే పుతిన్‌కు అరెస్టు వారెంట్ జారీ చేస్తున్నట్లు ఐసీసీ పేర్కొంది. అయితే అంతర్జాతీయ కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను రష్యా ఖండించింది. ఇది అర్థరహితమైన ఆదేశాలని కొట్టిపారేసింది. అంతేకాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధ సమయంలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ప్రజలపై అరాచకాలకు పాల్పడ్డాయంటూ పదేపదే వచ్చిన ఆరోపణలను సైతం ఖండించింది. అసలు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అంటే ఏంటి, ఎలాంటి సమయాల్లో ఈ కోర్టును ఆశ్రయిస్తారు.. ? ఈ కోర్టు ఎక్కడుంది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు రెండు దశాబ్దాల క్రితం అంటే 2002లో ఏర్పాటు అయ్యింది. యుద్ధ నేరాలు, మనుషులపై నేరాలు, నరమేధం, దురాక్రమణ నేరాలను విచారణ చేసేందుకు ఈ కోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టులో సభ్యదేశాలు తమ దేశాలపై లేదా తమ దేశ భూభాగంపై ఇతర దేశాలు నేరాలకు పాల్పడితే విచారణ చేసి చర్యలు తీసుకునే హక్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో 123 సభ్య దేశాలుండగా... ఈ కోర్టు నిర్వహణ కోసం 2023 సంవత్సరంకు గాను రూ.170 మిలియన్ యూరోల బడ్జెట్‌ను కేటాయించడం జరిగింది.

ఇక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో 17 నేరవిచారణలు జరుగుతున్నాయి. వీటిలో ఉక్రెయిన్, ఆఫ్రికా దేశాలైన ఉగాండా, కాంగో, కెన్యా, లాటిన్ అమెరికా ప్రాంతంలోని వెనెజులా,ఆసియా దేశాలైన మియన్మార్, ఫిలిప్పైన్స్‌కు సంబంధించిన నేరారోపణలపై విచారణ జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కోర్టు ముందుకు 31 కేసులు విచారణకు వచ్చాయని ఐసీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. ఐసీసీ జడ్జిలు 38 అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. 21 మంది నిందితులు ఇస్సటి వరకు కోర్టు ముందుకు హాజరయ్యారు. ఇందులో 14 మంది పై కేసులు చాలా బలంగా ఉండగా, విచారణ దశలో ఐదుగురు మృతి చెందడంతో వారిపై కేసులను ఎత్తివేయడం జరిగింది. న్యాయమూర్తులు 10 మందికి శిక్ష విధించగా నలుగురిని నిర్దోషులుగా తేల్చారు.

యుద్ధ నేరారోపణలు, మానవత్వంపై దాడికి సంబంధఇంచిన కేసులో ఐదుగురికి ఐసీసీ శిక్ష విధించింది. వీరికి 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గరిష్టంగా జీవితఖైదు కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇలా శిక్ష పడిన వారిలో డాఫర్‌లో మారణహోమం జరగాలని భావించిన మాజీ సుడాన్ నేత ఒమర్ అల్ బషీర్ ఉన్నాడు. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడు. ఐసీసీ ముందు హాజరైన తొలివ్యక్తి గా ఐవరీ మాజీదేశాధినేత లారెంట్ బాగ్బో నిలిచారు. మూడేళ్ల విచారణ తర్వాత 2019లో ఆయన్ను నిర్దోషిగా కోర్టు పేర్కొంది.

ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చాలా వరకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు, యూరోపియన్ యూనియన్ దేశాలు మద్దతుగా నిలుస్తుండగా... అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రం ఈ కోర్టుకు దూరంగా ఉన్నాయి. ఈ కోర్టులో విచారణ రాజకీయ దురుద్దేశాలతో కూడా జరగొచ్చన్న వాదనను వినిపిస్తున్నాయి. 2022 మార్చి 2వ తేదీన ఉక్రెయిన్ వేసిన పిటిషన్‌ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ చేపట్టింది. 2013 నవంబర్ 21వ తేదీ నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడమే కాకుండా పలు నేరాలకు పాల్పడుతోందంటూ పిటిషన్‌లో పేర్కొన్నట్లు ఐసీసీ వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది. 2013లో అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ పాలనపై పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దీంతో 2014లో పదవి కోల్పోయిన ఆయన రష్యాకు పారిపోయాడు. ఇక అప్పటి నుంచి రష్యా దురాగతాలు ఉక్రెయిన్ పై పెరిగిపోయాయి. ఇది కాస్త యుద్ధానికి దారి తీసింది.












Click it and Unblock the Notifications