Israel Hamas War: గాజాలో పెరిగిపోతున్న మృతులు-ఇజ్రాయెల్ పై మిత్రుల నుంచే ఒత్తిడి !
ఇజ్రాయెల్ పై హమాస్ దాడుల తర్వాత గాజాపై జరుగుతున్న ప్రతిదాడుల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అంతర్జాతీయంగా మిత్రదేశాలు వద్దంటున్నా వినకుండా ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న దాడులపై తీవ్రవ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ముఖ్యంగా ఐరాస మాట కూడా వినకుండా గాజాలో మానవతా సాయాన్ని కూడా అడ్డుకుంటూ ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై అరబ్, ముస్లిం దేశాలతో పాటు అమెరికా, ఫ్రాన్స్ వంటి మిత్రదేశాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గాజాలో ఇజ్రాయెల్ దాడుల కారణంగా మరణాల సంఖ్య పెరగడం, ఆసుపత్రుల సమీపంలో, చుట్టుపక్కల ఉన్న ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరాటాలు తీవ్రతరం కావడంతో పాలస్తీనా పౌరులను రక్షించడానికి చర్యలు తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా గాజాలో ఆస్పత్రులపై సైతం దాడులు చేస్తుండటంతో సాధారణ పౌరులు ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఇజ్రాయెల్ ను కట్టడి చేయాలన్న డిమాండ్లు, ఒత్తిడి పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం ఇజ్రాయెల్ మిత్రదేశాలపై ఎక్కువగా పడుతోంది.

అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్.. హమాస్‌ను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అలాగే గాజా స్ట్రిప్‌లో సైనిక దాడుల్ని ప్రారంభించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 11,070 మంది పాలస్తీనియన్లు, వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు, మైనర్లు మరణించారు. ఇజ్రాయెల్ చెబుతున్న దాని ప్రకారం గత రెండు రోజులుగా 100,000 మంది పాలస్తీనియన్లు దక్షిణానికి పారిపోయారు. అయితే వారు ఇప్పటికీ బాంబు దాడులను, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇదంతా ఇజ్రాయెల్ కు సమస్యగా మారింది.
మరోవైపు ఇజ్రాయెల్, హమాస్ ప్రస్తుతం బందీల విడుదల ప్రతిపాదనలపై చర్చలు జరుపుతున్నాయి. ఇందులో ఒకటి తక్కువ సంఖ్యలో వ్యక్తులను విడుదల చేయవలసి ఉంటుంది. మరొకటి గాజాలో ఉన్న 100 లేదా అంతకంటే ఎక్కువ మంది పౌరులను విడుదల చేయడం. ఇజ్రాయెల్ అధికారుల ప్రకారం హమాస్ గాజాలో 240 మందికి పైగా బందీలుగా పట్టుకెళ్లింది. వారిలో సగం కంటే తక్కువ మంది పౌరులు ఉన్నారని, వీరిని ముందుగా విడుదల చేసేలా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications