BRICS వేదికగా అమెరికా ఆధిపత్యానికి గండి ? ఇరాన్ దిమ్మదిరిగే ప్లాన్ ..!
భారత్ వేదికగా రేపు, ఎల్లుండి బ్రిక్స్ దేశాల సదస్సు (BRICS Summit) జరగబోతోంది. ఈ సదస్సుకు రష్యా, చైనాతోపాటు పలు అగ్రరాజ్యాధినేతలు హాజరు కాబోతున్నారు. వీరిలో దాదాపు 15 మందితో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ద్వైపాక్షిక భేటీలు కూడా నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాతో స్వదేశంలో ముఖాముఖీ యుద్దం చేస్తున్న ఇరాన్ (Iran).. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యానికి షాక్ ఇచ్చేందుకు సిద్దమైంది. బ్రిక్స్ దేశాల కూటమి ఏర్పాటు ఉద్దేశాన్నిఇందులో సభ్యదేశాలకు గుర్తుచేస్తూ అమెరికాకు ఫస్ట్ షాక్ ఇచ్చింది.
బ్రిక్స్ సమావేశంలో ఇతర దేశాధినేతలతో పాటు పాల్గొనబోతున్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. ఇవాళ డాలర్ వాడకాన్ని తగ్గించాలని వారికి పిలుపునిచ్చారు. అమెరికన్ డాలర్‌పై ఆధారపడకుండా దేశాలకు స్వేచ్ఛ కల్పించడానికే ఈ కూటమిని ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పెజెష్కియాన్ మధ్యాహ్నం 2 గంటలకు భారత్ కు వస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం కూడా నిర్వహించనున్నారు. బ్రిక్స్ సదస్సులో ఆయన డాలర్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సభ్యదేశాల్ని పెజెష్కియాన్ కోరబోతున్నారు.

డాలర్‌పై ఆధారపడటం నుండి దేశాలకు విముక్తి కల్పించడానికి, ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి కొత్త బ్రిక్స్ (BRICS) బ్యాంకును ఏర్పాటు చేశారని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. కాబట్టి ఈ కూటమిలో సభ్య దేశాలు డాలర్ ఆధిపత్యానికి గండి కొట్టేందుకు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ సదస్సులో పెజెష్కియాన్‌తో పాటు, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, యూఏఈ యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియా ప్రధానమంత్రి అబియ్ అహ్మద్, వియత్నాం ప్రధానమంత్రి లే మిన్ హంగ్ వంటి పలువురు ప్రపంచ నాయకులు హాజరు కానున్నారు.














Click it and Unblock the Notifications
