ఇరాన్ సంక్షోభం: హైదరాబాద్ విద్యార్థుల హాహాకారాలు!
ఇరాన్‌లో నెలకొన్న తీవ్ర అంతర్గత అశాంతి, ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన వందలాది మంది విద్యార్థులు ఇప్పుడు అక్కడ బందీలుగా మారిన పరిస్థితి నెలకొంది. యూనివర్సిటీలు పాస్‌పోర్టులు ఇవ్వకపోవడం, విమాన టికెట్లు కొనేందుకు డబ్బులు లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విద్యార్థుల ముందున్న ప్రధాన సవాళ్లు:
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని షహీద్ బెహెష్తీ యూనివర్సిటీలో సుమారు 70 నుంచి 80 మంది హైదరాబాద్ విద్యార్థులు చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య వందల్లో ఉంది. వారిని ప్రస్తుతం మూడు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. యూనివర్సిటీ యాజమాన్యాలు భారతీయ విద్యార్థుల పాస్‌పోర్టులను తమ వద్దే అట్టిపెట్టుకున్నాయి. పాస్‌పోర్టులు లేకపోవడంతో విద్యార్థులు టిక్కెట్లు బుక్ చేసుకోలేక, దేశం విడిచి రాలేకపోతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఈ విద్యార్థులకు ప్రస్తుతం విమాన టికెట్ల ధరలు భారంగా మారాయి. యుద్ధ వాతావరణం వల్ల టికెట్ల రేట్లు ఆకాశాన్ని తాకడంతో వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఇరాన్‌లో ఇంటర్నెట్‌పై తీవ్ర ఆంక్షలు ఉండటంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కనీసం ఫోన్ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. దీంతో ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

రంగంలోకి అసదుద్దీన్ ఓవైసీ: కేంద్రానికి విజ్ఞప్తి
హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎంఅధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ విషయంపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. "చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత గురించి ఆందోళనతో నాకు ఫోన్ చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడటం మంచిదే, కానీ ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యార్థుల పాస్‌పోర్టులు ఇప్పించి, వారిని ఎయిర్‌లిఫ్ట్ చేసేలా కేంద్రం ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి" అని ఒవైసీ డిమాండ్ చేశారు.
అగమ్యగోచరంగా భవిష్యత్తు
విద్యార్థుల ప్రాణాల రక్షణ ఒకెత్తయితే, వారి చదువు మరో పెద్ద సమస్యగా మారింది. భారీగా ఫీజులు చెల్లించి మెడికల్, టెక్నికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మధ్యలోనే భారత్‌కు వచ్చేస్తే వారి డిగ్రీల పరిస్థితి ఏమిటి? ప్రభుత్వం వారికి దేశీయంగా ఏవైనా ప్రత్యామ్నాయాలు చూపిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ప్రస్తుతానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈరాన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్యార్థుల తరలింపు ఇంకా వేగవంతం కావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications