అమెరికా దాడుల భయం.. అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్!
ఇరాన్ తన అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోంది. అమెరికా దాడుల భయం నేపథ్యంలో ఇది ముందు జాగ్రత్త చర్యగా చూడవచ్చు.టెహ్రాన్ అధికారులు ఇలా చెప్తున్నారు. యుద్ధ సమయాల్లో అణు స్థావరాల చుట్టూ రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి ఈ మాత్రలు ఇవ్వడం సాధారణ పద్ధతి.
ఒక ఇరాన్ ఆరోగ్య అధికారి బ్రిటిష్ వార్తాపత్రిక ది టైమ్స్‌తో మాట్లాడుతూ "అవును, మేం అయోడిన్ పంపిణీ చేస్తున్నాం. ట్రంప్‌ను ఇక నమ్మలేం. ఆయన ఈ నేరానికి పాల్పడే అవకాశం ఉంది" అని చెప్పారు. అణు కేంద్రాలకు దగ్గరగా ఉన్న ప్రజలపై రేడియోధార్మికత ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. అయోడిన్ టాబ్లెట్లు పొటాషియం అయోడైడ్ థైరాయిడ్ గ్రంథిని రక్షించడంలో సహాయపడతాయి.

రేడియోధార్మిక అయోడిన్ థైరాయిడ్‌లో చేరి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది. స్థిరమైన అయోడిన్ ముందుగా గ్రంథిని నింపేస్తే రేడియోధార్మిక అయోడిన్ పీల్చుకునే అవకాశం తగ్గుతుంది. అయితే ఇవి పేలుడు లేదా ఇతర రేడియేషన్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వవు అని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుతం దృష్టి పికాక్స్ పర్వతం అనే భూగర్భ అణు స్థావరంపై ఉంది.
నటాంజ్ సమీపంలో ఉన్న ఈ బలమైన స్థావరంపై అమెరికా దాడి చేయొచ్చన్న భయాలు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఈ స్థావరం గురించి ప్రస్తావిస్తూ మరిన్ని సైనిక చర్యలు తీసుకోవాల్సి రావచ్చని హెచ్చరించారు. అయితే అణ్వస్త్రాలు వాడబోమని మాత్రం స్పష్టం చేశారు.ఇరాన్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లో పికాక్స్ పర్వతంపై దాడి జరిగితే ఎలా స్పందించాలో సూచనలు ఉన్నాయి.
సమీపంలో ఉన్నవారికి 10 నుంచి 15 నిమిషాల్లోనే ఆశ్రయం తీసుకోవాలని, దూర ప్రాంతాలవారికి కొన్ని గంటల సమయం ఉంటుందని చెబుతున్నారు. "లోపలికి వెళ్లండి, లోపలే ఉండండి, అప్డేట్స్ వినండి" అనే సూచనలు ఇస్తున్నారు. బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో ఇప్పటికే లక్షల సంఖ్యలో టాబ్లెట్లు పంపిణీ అయినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని నివేదికలను తిరస్కరిస్తూ, ఇది సాధారణ సంసిద్ధతా చర్య అని చెప్పింది. అమెరికా వైపు నుంచి ఇరాన్ అణు కార్యక్రమం గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.180 కోట్లకు పైగా రివార్డు ప్రకటించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఇరాన్ ప్రజలు, అధికారులు ఇలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
