ఇదిగో.. మొజ్తబా ఖమేనీ: తాజా వీడియో ఫుటేజీ: ఆ వార్తలన్నీ ట్రాష్
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తలెత్తిన ఉత్కంఠకు తెరపడింది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోన్నారంటూ ఇజ్రాయెల్ చేస్తోన్న ప్రచారాన్ని ఇరాన్ అధికారిక మీడియా సంస్థ మెహర్ తిప్పి కొట్టింది. ఆ వాదనలను కొట్టిపారేసింది. ఎదురుదాడికి దిగింది. ఓ వీడియోను తాజాగా విడుదల చేసింది. మొజ్తబాకు సంబంధించిన అఫీషియల్ వీడియో ఫుటేజీ ఇది.
మొజ్తబా ఖమేనీ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఆయనను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారని పేర్కొంటూ ఇజ్రాయెల్‌కు చెందిన ఛానెల్ 14 ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ అంతర్గత వర్గాలను ఈ కథనంలో ఉటంకించింది. మొజ్తబా భవిష్యత్తు, ఆయన వారసత్వంపై ఇరాన్ అత్యున్నత స్థాయి ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతోన్నాయని తెలిపింది.

ది జెరూసలేం పోస్ట్ సైతం దీనిపై ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులను ఉటంకిస్తూ ఖమేనీ ఆరోగ్యంపై సున్నిత వివరాలను బయటపెట్టింది. సుప్రీం లీడర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, త్వరలోనే ఆయనకు సంబంధించిన ఓ విషాదకరను వినాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇరాన్ ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు తెలిపింది.
దీంతో ఇరాన్ రాజకీయ సుస్థిరతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అటు ఇరాన్ లోనూ గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. తండ్రి అయతొల్లా ఖమేనీ మరణ సమయంలోనూ మొజ్తబా బయట కనిపించకపోవడం వల్ల ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో మొజ్తబా ఆరోగ్యంపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇరాన్ కు. దేశ అంతర్గత రాజకీయాలపై పట్టు కోల్పోలేదని నిరూపించుకోవడం అత్యవసరంగా మారింది కూడా.
మొజ్తబా ఖమేనీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు నిరూపించే క్రమంలో మెహర్ వార్తా సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో.. మంత్రులు, అధికార ప్రతినిధులతో మొజ్తబా ఖమేనీ చర్చలు నిర్వహించడాన్ని ఈ వీడియో ఫుటేజీలో చూడొచ్చు. సంపూర్ణ ఆరోగ్యంతో చురుగ్గా కనిపించారు.
🇮🇷 NEW FOOTAGE OF KHAMENEI RELEASED: Iran’s Mehr News released footage it claims shows Supreme Leader Mojtaba Khamenei “for the first time.” The video has no confirmed date or location, and part of his face is not visible. pic.twitter.com/qvTR3Yb6vq
— Belaaz News (@TheBelaaz) August 9, 2026
ఆయన ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి వార్తలను కూడా విశ్వసించవద్దని మెహర్ సంస్థ కోరింది. ఇరాన్ ఇస్లామిక్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పర్యవేక్షణలో పనిచేసే వార్తా సంస్థ ఇది. ఈ వీడియో ఫుటేజీ ఎప్పుడు చిత్రీకరించారనేది తెలియరావట్లేదు. ఈ విషయంపై తేదీ, సమయం, ఇతర వివరాలను ఆ సంస్థ వెల్లడించట్లేదు.




Click it and Unblock the Notifications