Israel- Hamas War: ఇజ్రాయెల్‍ను హెచ్చరించిన ఇరాన్..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ గాజాపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం భూ దండయాత్ర కోసం గాజాలోకి ప్రవేశిస్తే బాగుండదని పేర్కొంది. పాలస్తీనియన్లపై దురాక్రమణను తక్షణమే ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది.
"గాజా స్ట్రిప్‌లో పిల్లలను చంపే ఇజ్రాయెల్ దాడులను వెంటనే ఆపాలి. లేకుంటే ఈ ప్రాంతంలోని అన్ని దేశాల చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయి."అని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్-అబ్డోల్లాహియాన్ ఆదివారం అన్నారు.
"జియోనిస్ట్ సంస్థ [ఇజ్రాయెల్] గాజాలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటే, ప్రతిఘటన నాయకులు దానిని ఆక్రమణ సైనికుల శ్మశానవాటికగా మారుస్తారు" అని తెలిపారు.

అక్టోబర్ 7న పాలస్తీనా సాయుధ సమూహం హమాస్ ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 2,670 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్ గాజాలో ఉన్న ఉగ్రవాదులే టార్గెట్ గా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో దాదాపు 10,000 మంది సామాన్య ప్రజలు గాయపడ్డారు. గాజా పరిస్థితి దారుణంగా ఉంది.
ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఒక మిలియన్ మంది ప్రజలు గాజా నుంచి ఇతరు ప్రాంతాలకు వెళ్తున్నారు.
ఇజ్రాయెల్ లో 289 మంది సైనికులు, కొంతమంది విదేశీ పౌరులు సహా కనీసం 1,400 మంది మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. గత వారాంతంలో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో ప్రత్యక్షంగా ప్రమేయం ఉందన్న వాదనలను ఇరాన్ ఖండించింది.
అమీర్-అబ్దుల్లాహియాన్ శనివారం ఖతార్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియేతో సమావేశమయ్యారు. వారు గాజా సంక్షోభం గురించి చర్చించారు. పాలస్తీనియన్లకు సహాయం చేయడానికి అన్ని ఇస్లామిక్ దేశాల బాధ్యత ఉందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి ఇరాన్ దౌత్యపరమైన ప్రయత్నం చేస్తోంది.












Click it and Unblock the Notifications