"లిటిల్ ఇండియా" పై ఇరాన్ భీకర దాడి- ఇజ్రాయెల్ డిఫెన్స్ లెస్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత రవాణా ప్రయత్నాలకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఈ మేరకు ఓ జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన వ్యవస్థను స్థిరీకరించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటామని వెల్లడించాయి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
ఈ పరిణామాల మధ్య ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరించింది. భీకర దాడికి దిగింది. ఇజ్రాయెల్ న్యూక్లియర్ టౌన్ డిమోనాపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో 47 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటోంది. బీర్‌షెబా సొరోకా ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తోన్నారు. జనావాసాలపై ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఈ దాడుల్లో అనేక భవనాలు కుప్పకూలాయి. వాటి శిథిలాల మధ్య చిక్కుకుని పలువురు గాయపడ్డారు.

డిమోనా.. ఇజ్రాయెల్ న్యూక్లియర్ టౌన్ గా పేరుంది. లిటిల్ ఇండియాగా పిలుస్తారీ పట్టణాన్ని. ఆ దేశ అణ్వాయుధ కార్యకలాపాలకు ప్రాంతాన్ని గుండెకాయగా భావిస్తారు. నేరుగా ఇరాన్ ఈ టౌన్ పైనే దృష్టి సారించింది. మిస్సైళ్లను సంధించింది. వీటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎందుకు ఇంటర్ సెప్ట్ కాలేకపోయిందనేది సవాలక్ష డాలర్ల ప్రశ్నగా మారింది. అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గల ఇజ్రాయెల్.. ఈ మిస్సైళ్లను పసిగట్టలేకపోయింది. వీటిని అడ్డుకోలేకపోయింది.
ఈ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడంలో డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు విఫలమైందనే విషయంపై ఇజ్రాయెల్ ఆరా తీస్తోంది. చివరి నిమిషంలో కొన్ని ఇంటర్‌సెప్టర్‌లను ప్రయోగించినా అవి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ఛేదించలేకపోయాయని సైన్యం తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుగుతుందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది.
ఈ దాడి అనంతరం అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. అణ్వాస్త్ర ప్రదేశాలపై దాడులు చేసే విషయంలో సంయమనం పాటించాలని కోరింది. డిమోనాలో గానీ నెగెవ్ లో గానీ అణు కేంద్రాలకు నష్టం జరగలేదని తెలిపింది. తమ దేశంలోని నటాంజ్ అణు సంపద కేంద్రంపై గతంలో జరిగిన దాడికి ప్రతిస్పందనగానే డిమోనాపై దాడి చేశామని ఇరాన్ పేర్కొంది.
డిమోనా పట్టణానికి లిటిల్ ఇండియా అనే గుర్తింపు ఉంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో భారతీయ-యూదులు నివసిస్తోన్నారు. వారిలో చాలామంది మహారాష్ట్రకు చెందినవారే. పట్టణ జనాభాలో సుమారు 30 శాతం భారతీయ మూలాలున్నవారే. మరాఠీ ఇక్కడ విస్తృతంగా మాట్లాడతారు. స్థానిక దుకాణాల్లో సోన్‌పాప్‌డీ, గులాబ్ జామున్, పాప్రి చాట్, భేల్‌పూరి వంటి భారతీయ రుచులు లభిస్తాయి. యువతలో క్రికెట్‌కు ఆదరణ ఉంది. భారత్ లో ఉన్నట్టుంటిక్కడ.












Click it and Unblock the Notifications