ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణికిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది!
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. రాజధాని టెహ్రాన్‌కు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోల్ఫా నగరం సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ దేశ అధికారిక మీడియా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడి పరిస్థితి ఎలా ఉందనే విషయంపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
ప్రమాద స్థలానికి చేరుకునేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయని ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. అయితే, ప్రతికూల వాతావరణం ఇందుకు అవరోధంగా మారిందని పేర్కొంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోందని, గాలులు వీస్తున్నాయని వివరించింది.

కాగా, ఇబ్రహీం రైసీ ఆదివారం అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్లారు. అరస్ నదిపై రెండు దేశాలు కలిసి నిర్మించిన డ్యామ్‌ను ఆయన అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్‌తో కలిసి ప్రారంభించాలన్నది ప్రణాళిక. అయితే, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది.
రైసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిరబ్డొల్లాహియాన్, ఇరాన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్, ఇతర అధికారులు కూడా ప్రయాణిస్తున్నట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ నివేదించింది. ఒక స్థానిక ప్రభుత్వ అధికారి సంఘటనను వివరించడానికి "క్రాష్" అనే పదాన్ని ఉపయోగించారు, కానీ ఆయన ఇంకా సైట్‌ను చేరుకోలేదని ఇరాన్ వార్తాపత్రికకు అంగీకరించాడు.
ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన ఘటనపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన నుంచి ఇరాన్ అధ్యక్షుడు క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. హెలికాప్టర్ ఘటనను పరిశీలిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications