వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌పై రష్యాకు ప్రేమ పెరుగుతోందా? భారత్‌కు దూరమవుతోందా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పుతిన్, ఇమ్రాన్ ఖాన్

అఫ్గానిస్తాన్‌ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గత మంగళవారం ఫోన్‌లో చర్చించారు.

ఒక నెలలోపు ఇద్దరు నేతల మధ్య జరిగిన రెండో ఫోన్ సంభాషణ ఇది. దీనికి ముందు ఆగస్టు 25న ఇద్దరు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.

ఎస్‌సీఓ (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌)లో సహకారం పెంచడంపై చర్చించామని పుతిన్‌తో ఫోన్ సంభాషణపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన విడుదల చేశారు.

గత నెలలో కూడా అఫ్గానిస్తాన్‌పై ఇద్దరు నేతలు ఫోన్‌లో చర్చించారు. ప్రభుత్వ ప్రకటనల ప్రకారం, అఫ్గానిస్తాన్‌లో మానవతా సంక్షోభాన్ని నివారించడానికి సహాయం కోసం ఇద్దరు నాయకులు విజ్ఞప్తి చేశారు.

రష్యా, పాకిస్తాన్

సంక్షోభంలో కూరుకుపోయిన అఫ్గానిస్తాన్‌లోని పరిస్థితులను చక్కదిద్దడానికి రష్యా, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు చాలా ముఖ్యమని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

రష్యాతో సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు పాకిస్తాన్ కృతనిశ్చయంతో ఉందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో రెండు దేశాల మధ్య విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు.

"రెండు దేశాల మధ్య సంబంధాలు ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయ సమస్యలపై రెండు దేశాల మధ్య నమ్మకం పెరిగింది. ఇటీవల రష్యాతో ద్వైపాక్షిక సహకారం పెరిగింది. భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు సన్నిహితంగా ఉండాలని అంగీకారం కుదిరింది" అని పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అఫ్గానిస్తాన్‌లో శాంతి కోసం రష్యా నాయకత్వంలో ఏర్పడిన ట్రాయికా ప్లస్‌లో పాకిస్తాన్ కూడా చేరింది. రష్యా, పాకిస్తాన్‌తో పాటు అమెరికా, చైనా కూడా ఇందులో ఉన్నాయి. భారతదేశం కూడా దీనిలో చేరాలని కోరుకుంది. కానీ చేరలేకపోయింది. భారత్‌ చేరికపై రష్యా, అమెరికాకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చైనా, పాకిస్తాన్‌లు అభ్యంతరం చెప్పాయని భావిస్తున్నారు.

పుతిన్ పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. పుతిన్‌ను శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించామని, కానీ ఆ తర్వాత అది వాయిదా పడిందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టంచేశారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పాకిస్తాన్‌లో పర్యటించారు. గత సంవత్సరం పాకిస్తాన్ రక్షణ మంత్రి రష్యాకు వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత రష్యా విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌లో పర్యటించారు.

సెర్గీ లావ్రోవ్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆ పర్యటనలో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్‌కు సైనికంగా కూడా రష్యా సహాయం చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

रूस और भारत

అఫ్గానిస్తాన్‌పై అమెరికా ఆసక్తి చూపడం లేదని, కాబట్టి ఇకపై పాకిస్తాన్ అవసరం దానికి లేదని అమెరికాలో పాకిస్తాన్ మాజీ రాయబారి సయ్యదా అబిదా హుస్సేన్ గత వారం ఇంగ్లీష్ వార్తాపత్రిక డాన్ ఆఫ్ పాకిస్తాన్‌కు చెప్పారు.

"కాబుల్‌ను నియంత్రించడానికి అమెరికా అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు తాలిబాన్‌లతో మాట్లాడతాయని నేను అనుకుంటున్నాను. మారిన తాలిబాన్లను ప్రపంచం అంగీకరిస్తుంది. పాకిస్తాన్ ఇప్పుడు అమెరికాకు బదులుగా చైనా, రష్యా వైపు చూడాలి. రష్యాకు దగ్గరవ్వడానికి ప్రయత్నించాలి" అని 1991 నుంచి 1993 వరకు అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా పనిచేసిన అబిదా హుస్సేన్ అన్నారు.

భారతదేశంపై ఒత్తిడి తెచ్చేందుకే రష్యా, పాకిస్తాన్‌కి దగ్గరైనట్లు నటిస్తోందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశం బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను రష్యా నుంచి కొనుగోలు చేస్తుందని, ఇలా చేయడం పాకిస్తాన్ వల్ల కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో భారత్, అమెరికాకు దగ్గరవ్వడం రష్యాకు నచ్చడం లేదు.

रूस और चीन

పుతిన్ గత 20 సంవత్సరాలుగా రష్యాలో అధికారంలో ఉన్నారు. కానీ ఆయన పాకిస్తాన్‌కు వెళ్లలేదు. కానీ ఆయన భారత్‌కు చాలాసార్లు వచ్చారు.

అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చినప్పుడు, సహజంగా పాకిస్తాన్ కూడా వెళ్తుంటారు. కానీ, పుతిన్ ఎప్పుడూ ఇలా చేయలేదు.

ఇప్పటి వరకు రష్యా అధ్యక్షులు ఎవరూ పాకిస్తాన్‌ను సందర్శించలేదు. రష్యా సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు, ఏ అధ్యక్షుడూ పాకిస్తాన్‌ను సందర్శించలేదు. సోవియట్ యూనియన్ పతనమైన 16 సంవత్సరాల తరువాత రష్యా ప్రధాని మిఖాయిల్ ఫ్రాడ్కోవ్ మాత్రం పాకిస్తాన్‌ను సందర్శించారు.

దక్షిణ ఆసియాలో పుతిన్ పర్యటించిన ఏకైక దేశం భారతదేశం మాత్రమే.

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, ప్రపంచం రెండుగా విడిపోయినప్పుడు, భారతదేశం అధికారికంగా ఏ కూటమిలోనూ ఉండకూడదని నిర్ణయించుకుంది. భారతదేశ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ నాన్-అలైన్‌మెంట్ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ సోవియట్ యూనియన్, సోషలిజం వైపు మొగ్గు చూపారు.

ఈ సమయంలో పాకిస్తాన్ అమెరికా నేతృత్వంలోని వర్గాన్ని ఎంచుకుంది. భారత్, రష్యా మధ్య చారిత్రక సంబంధాల బలమైన పునాది ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది.

రష్యా

2012 అక్టోబర్ 3న అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజకిస్తాన్ దేశాల ఇస్లామాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశాయి.

ఈ సమావేశానికి హాజరు కావడానికి పుతిన్ ఒక రోజు ముందుగానే వస్తారని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు కూడా జరుగుతాయని పాకిస్తాన్ భావించింది.

పుతిన్ పర్యటనపై పాకిస్తాన్ మీడియా చాలా హడావుడి చేసింది. పుతిన్‌ పాక్‌ పర్యటన చారిత్రాత్మకమని అభివర్ణించింది.

అయితే ఈ సమావేశానికి కొన్ని రోజుల ముందు, తాను రావడంలేదని పుతిన్ అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి లేఖ రాశారు.

దీంతో నాలుగు దేశాల ఈ సమావేశాన్ని పాకిస్తాన్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సమావేశానికి హాజరు కావడానికి రష్యా అంగీకరించిందని, కానీ రష్యా ప్రతినిధి బృందానికి అధ్యక్షుడు పుతిన్ నాయకత్వం వహిస్తారని ఎప్పుడూ చెప్పలేదని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

పుతిన్ పాకిస్తాన్ వెళ్లడానికి బలమైన కారణం లేదని రష్యా భావిస్తోంది. 2016 మార్చి 17న ఇస్లామాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో పాకిస్తాన్-రష్యా సంబంధాల గురించి పాకిస్తాన్‌లోని నాటి రష్యా రాయబారి అలెక్సీ డెడోవ్ మాట్లాడుతూ.."సమస్య ఏమిటంటే పర్యటన కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు. పర్యటనకు ఒక బలమైన కారణం ఉండాలి. ఏదైనా బలమైన కారణం ఉంటే, పర్యటన ఖచ్చితంగా జరుగుతుంది" అని అన్నారు.

रूस और भारत

1979-1989 మధ్య అఫ్గానిస్తాన్‌లో జిహాదీలకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయుధాలను సరఫరా చేయడంతోపాటూ వారికి శిక్షణ కూడా ఇచ్చిందని విమర్శలు వచ్చాయి. అఫ్గానిస్తాన్ నుంచి రష్యాను తరిమికొట్టడంలో పాకిస్తాన్ ముఖ్య పాత్ర పోషించి ఉంటుందని చాలామంది నిపుణులు భావిస్తున్నారు.

పాకిస్తాన్, రష్యా మధ్య ఆర్థిక సంబంధాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం 2015లో 395 మిలియన్ డాలర్లుగా ఉంది. 2014తో పోల్చితే ఇది 13% తగ్గింది. రష్యాతో సంబంధాలు పెట్టుకునేంత ఆర్థిక సామర్థ్యం పాకిస్తాన్‌కు లేదని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Is Russia's love for Pakistan growing? Getting away from India?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X