వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 వ్యాక్సీన్ గర్భిణులకు సురక్షితమేనా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కోవిడ్-19

కోవిడ్-19 వ్యాక్సీన్ తయారీకి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి కొన్ని నెలల్లో వ్యాక్సీన్ అందుబాటులోకి రావొచ్చు. ఇది 90% ప్రజలను కోవిడ్ 19 నుంచీ కాపాడగలదని ఆశిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సీన్ గురించి అనేక అనుమానాలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

వాటన్నిటికీ బీబీసీ హెల్త్ ఆన్లైన్ ఎడిటర్ మిషెల్ రాబర్ట్స్ సమాధానాలిస్తున్నారు. అవేమిటో చూద్దాం.

ప్రశ్న: కోవిడ్-19 వ్యాక్సీన్ గర్భిణులకు, పుట్టబోయే బిడ్డలకు సురక్షితమేనా?

జవాబు: ఒక వ్యాక్సీన్ పూర్తిగా సురక్షితమని నిర్థరణ అయిన తరువాతే దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. అయితే, అది గర్భిణులకు అందిస్తారా లేదా అనేది స్పష్టంగా తెలీదు.

కరోనావైరస్ గర్భిణులకు ఎక్కువ హాని చేస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ముందు జాగ్రత్త చర్యగా గర్భిణులకు వైరస్ సంక్రమించకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

అయితే, కొన్ని రకాల ఫ్లూ వ్యాక్సిన్లు గర్భిణులకు కూడా ఇస్తారు.

కోవిడ్-19

ప్రశ్న: వ్యాక్సీన్ విషయంలో వృద్ధులకు మొదట ప్రాధాన్యం ఇస్తున్నప్పుడు, భార్యాభర్తలిద్దరిలో వయసు ఎక్కువ ఉన్నవారిని ఆధారంగా తీసుకుని, రెండో వారిని కూడా ప్రాధాన్యత లిస్ట్‌లో చేర్చే అవకాశం ఉందా?

జవాబు: ప్రాధాన్యత లిస్ట్ ఇంకా తయారు చెయ్యలేదు. అయితే, ఆ లిస్ట్ తయారు చేసినప్పుడు వయసుని బట్టి వ్యక్తులకే ప్రాధాన్యమిస్తారు. దంపతులకి కాదు.

ప్రశ్న: ఈ వ్యాక్సీన్, వైరస్ వ్యాప్తిని అరికట్టగలదా?

జవాబు: ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లన్నీ కూడా వైరస్ ఒకరి నుంచీ మరొకరికి సోకకుండా నియంత్రించగలవో లేవో ఇప్పుడప్పుడే స్పష్టంగా చెప్పలేం. కొన్ని వ్యాక్సిన్లు వైరస్‌ను అరికట్టడం కన్నా వ్యాధి తీవ్రతను తగ్గించే దిశగా పనిచెయ్యొచ్చు.

ప్రశ్న: వ్యాక్సీన్ వేయించుకోవడం తప్పనిసరా?

జవాబు: కాదు. ఇష్టమైనవారు మాత్రమే వేయించుకోవచ్చు. తప్పనిసరిగా అందరూ వేయించుకోవాలనేం లేదు. కానీ వ్యాక్సీన్ ఎక్కువ అవసరం అయినవారికి...వృద్ధులకు, హెల్త్ వర్కర్లకు ముందు అందిస్తారు.

ప్రశ్న: వ్యాక్సీన్ వేయించుకోవడం తప్పనిసరి కాదంటున్నారు. మరి, వ్యాక్సీన్ వేయించుకున్నట్లు ప్రూఫ్‌లు చూపిస్తే తప్ప బయటనుంచి వచ్చేవారిని తమ దేశంలోకి అనుమతించమని ప్రభుత్వాలు నియమం విధించే అవకాశం ఉందా?

జవాబు: కొన్ని దేశాల్లో కొన్ని రకాల వ్యాక్సీన్లు వేయించుకున్నట్లు ప్రూఫ్ చూపించమని అడుగుతారు. ఉదాహరణకు పోలియో. ఇప్పుడు కోవిడ్-19 విషయంలో ఏ దేశం ఎలాంటి విధానం పాటిస్తుందనేది ఆయా దేశాల హెల్త్ పాలసీలపై ఆధారపడి ఉంటుంది. వ్యాక్సీన్ వేయించుకున్నట్లు ధ్రువీకరణ పత్రం అవసరమా లేదా అనే విషయంలో అన్ని దేశాలూ ఒకేలాంటి నిర్ణయాలని తీసుకుంటాయని చెప్పలేం.

కోవిడ్-19

ప్రశ్న: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి ఇస్తారు అనే దాని వెనుక ఉన్న లాజిక్ ఏంటి?

జవాబు: వ్యాక్సీన్ పూర్తిగా సురక్షితం అని నిర్థరణ అయిన తరువాత డాక్టర్లు, నర్సులు ఈ టీకాలను ప్రజలకు వెయ్యడం మొదలుపెడతారు.

ముందుగా రిస్క్ ఎక్కువ ఉన్నవారికి వ్యాక్సీన్ వేస్తారు. వయసు పైబడినవారికి కోవిడ్-19 తీవ్రంగా సోకే అవకాశం ఉంది కాబట్టి వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. వృద్ధాశ్రమాల్లోను, ఇళ్లల్లోనూ ఉండే వృద్ధులకు, వారిని దగ్గరుండి చూసుకునేవారికి ముందుగా వ్యాక్సీన్లు అందిస్తారు.

ముందు 80 సంవత్సరాలు పైబడినవారికి, తరువాత 65 ఏళ్ల వయసు పైబడినవారికి ఇస్తారు. అలాగే, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నవారికి కూడా ముందే వ్యాక్సీన్ అందిస్తారు. తరువాత వరుసగా అందరికీ అందిస్తారు.

అయితే, ఈ లిస్ట్ మారొచ్చు. ఒకవేళ ఒక నిర్దిష్టమైన వ్యాక్సీన్ కొన్ని బృందాలకు ఎక్కువ పనిచేస్తుంది అని నిర్థరణ అయితే వారికి ముందుగా ఇచ్చే అవకాశం ఉంది.

ప్రశ్న: కోవిడ్-19 వ్యాక్సీన్‌ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చెయ్యాలి కదా. మరి, ఆ ప్రక్రియలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందా?

జవాబు: వ్యాక్సీన్లో వాడే పదార్థాలకు స్థిరత్వం తక్కువ. అందువల్ల వ్యాక్సీన్లను మైనస్ 70 డిగ్రీస్ సెల్సియస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతవద్ద నిల్వ చెయ్యాలి.

కాబట్టి వ్యాక్సీన్ రవాణా చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. కానీ వ్యక్తులకు వ్యాక్సీన్ ఇచ్చే ముందు దాన్ని కరిగించాల్సి ఉంటుంది. టీకా ఇచ్చే ముందు ఐదు రోజుల వరకూ దాన్ని సాధారణ ఫ్రిడ్జ్‌లో ఉంచొచ్చని ఫైజర్ కంపెనీ చెబుతోంది.

కోవిడ్-19

ప్రశ్న: కోవిడ్-19 నుంచి కోలుకున్నవారు ఈ వ్యాక్సీన్ వేయించుకోవడం సురక్షితమేనా?

జవాబు: కరోనావైరస్ వ్యాక్సీన్ విస్తృతంగా వాడొచ్చని నిర్థరణ అయితే కోవిడ్-19 నుంచి కోలుకున్నవారు కూడా వేయించుకోవచ్చు. కోవిడ్ సోకి కోలుకున్న తరువాత శరీరంలో తయారయ్యే రోగనిరోధక శక్తి ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు. అలాంటప్పుడు వ్యాక్సీన్ వేయించుకుంటే రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది.

అయితే, ఈ విషయాలన్నిటి గురించి స్పష్టంగా తెలియాలంటే మరింత పరిశోధన జరగాల్సి ఉంది. మరింత డేటా సేకరించాల్సి ఉంటుంది.

ఫైజర్ కంపెనీ నిర్వహించిన ట్రయల్స్‌లో కోవిడ్ సోకనివారినే తీసుకున్నారు. కాబట్టి కోవిడ్ వచ్చిన తగ్గినవారి విషయంలో ఈ వ్యాక్సీన్ ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది స్పష్టంగా తెలీదు.

ప్రశ్న: కొత్తగా వచ్చే వ్యాక్సీన్ మింక్ (ఒక రకమైన జంతువు) నుంచీ వ్యాపించే కోవిడ్‌ను అరికట్టగలదా?

జవాబు: మనుషుల నుంచీ మింక్‌లకు కోవిడ్ సోకి, వాటిల్లో జన్యుపరమైన మ్యుటేషన్ జరిగి..తిరిగి వాటి ద్వారా మనుషులకు కోవిడ్ వ్యాపించొచ్చని ఈ మధ్యనే నిపుణులు కనుగొన్నారు.

మింక్‌లకు సోకినప్పుడు వైరస్‌లో సంభవించే మ్యుటేషన్‌లను పరిశీలిస్తున్నారు. అది మనుషులకు ప్రమాదకరమైనదా కాదా అనే విషయాన్ని పరిశోధిస్తున్నారు.

కోవిడ్-19

అయితే, ఇప్పటివరకూ ఈ మ్యుటేషన్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే మింక్‌ నుంచీ వ్యాపించే కోవిడ్‌పై కొత్త వ్యాక్సీన్ ప్రభావం ఉండదు అనడానికి కూడా ఆధారాలు లేవు.

సాధారణంగా అన్ని రకాల వైరస్‌లూ కొన్నేళ్లల్లో మ్యుటేషన్ చెందుతాయి. కొన్ని తక్కువ ప్రమాదకరమైనవిగా రూపాంతరం చెందుతాయి. ఫ్లూ వైరస్ తరచూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అందుకే ఫ్లూకు ఇచ్చే వ్యాక్సీన్లు కూడా మారుతూ ఉంటాయి.

ప్రశ్న: 90% ప్రభావంతమైనది అంటే అర్థమేమిటి? 90% ప్రజలపై ప్రభావం ఉంటుందని అర్థమా? లేక అందరిలోనూ 90% వ్యాధి తీవ్రతను తగ్గిస్తుందని అర్థమా?

జవాబు: ఫైజర్ కంపెనీ తమ వ్యాక్సీన్ ట్రయిల్స్ ముందస్తు ఫలితాలను ఈమధ్యే విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం...90% లేదా 10 మందిలో 9 మందికి ఈ వ్యాక్సీన్ ఇవ్వడం వలన కోవిడ్ సోకే ప్రమాదం ఉండదు అని తేలింది. అయితే ఈ వ్యాక్సీన్ మూడు వారాల తేడాతో రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. రెండో డోసు ఇచ్చిన వారం తరువాత 10 మందిలో 9 మంది పూర్తిగా సురక్షితంగా ఉంటారని తేలింది.

43,500 మంది మీద ఈ ట్రయిల్స్ నిర్వహించారు. వీరిలో సగం మందికి కోవిడ్-19 వ్యాక్సీన్, మరో సగం మందికి డమ్మీ వ్యాక్సీన్ ఇచ్చారు.

ఈ ట్రయిల్స్‌లో 43,500 మందిలో 94 మందికి కోవిడ్-19 లక్షణాలు కనిపించాయి. ఈ 94 మంది కూడా డమ్మీ వ్యాక్సీన్ తీసుకున్నవారే!

కోవిడ్-19

ప్రశ్న: ఒకసారి వ్యాక్సీన్ తీసుకుంటే అది ఎన్నాళ్లు మనల్ని కాపాడుతుంది? ఒక్కసారి వ్యాక్సీన్ తీసుకుంటే చాలా? లేక ప్రతీ ఏడాదీ తీసుకుంటూ ఉండాలా?

జవాబు: ఒకసారి వ్యాక్సీన్ వేయించుకున్నాక మళ్లీ బూస్టర్ డోసు తీసుకోవాల్సి రావొచ్చు. లేదా కొన్నిసార్లు వ్యాక్సీన్ వేయించుకోవాల్సి రావొచ్చు.

వ్యాక్సీన్ ప్రభావం ఎన్నాళ్లు ఉంటుందనేది స్పష్టంగా చెప్పలేమని నిపుణులు అంటున్నారు. కొన్నాళ్ల తరువాత దాని ప్రభావం తగ్గిపోవచ్చని భావిస్తున్నారు. అంటే మళ్లీ మళ్లీ వ్యాక్సీన్ వేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్‌లాగ ప్రతీ ఏడాదీ వేయించుకోవాల్సి రావొచ్చు.

కోవిడ్-19

ప్రశ్న: ఈ వ్యాక్సీన్ అనారోగ్యంతో ఉన్నవారికీ, వృద్ధులకు కచ్చితంగా సురక్షితమని ఎలా చెప్పగలరు?

జవాబు: కోవిడ్‌-19కు వ్యాక్సీన్ కనుగొనడానికి ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులందరూ రికార్డ్ వేగంగా పనిచేస్తున్నారు. అయితే, వేగంగా వ్యాక్సీన్ అభివృద్ధి పరచడం ముఖ్యమేకానీ ఎంతవరకూ సురక్షితం అన్నదానికే పెద్ద పీట వేస్తున్నారు.

ఏ వ్యాక్సీన్ అయినా పూర్తిగా సురక్షితం అని నిర్థరణ అయ్యేవరకూ మార్కెట్లోకి తీసుకురారు. క్లినికల్ ట్రయల్స్‌లో వేలమందిపై ప్రయోగాలు చేస్తున్నారు.

ఒక వ్యాక్సీన్ ఆమోద ముద్ర పొంది ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తారు. ఎలాంటి మందులకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. వ్యాక్సీన్లకు కూడా ఉంటాయి. అయితే, ఒక వ్యాక్సీన్ వల్ల లాభాలు అధికశాతం ఉన్నప్పుడు దానికి ఆమోదముద్ర లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
covid-19 vaccine safe for Pregnant women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X