ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 15 మంది నవజాత శిశువులు మృతి
భారత్ కు పొరుగు దేశమైన పాకిస్థాన్ లో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా చమురు, గ్యాస్ రవాణా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అలాగే ఆ దేశంలో రాజకీయ అనిశ్చితి కూడా నెలకొంది. మరోవైపు అంతర్గత భద్రతా సవాళ్లతో ఆ దేశం అట్టుడుకిపోతుంది. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ లో తాజాగా హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇస్లామాబాద్ లోని పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది నవజాత శిశువులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.
ఎయిర్ కండీషనింగ్ లో ఏర్పడిన పొరపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రియటర్స్ అలాగే పాకిస్థాన్ లోని ప్రముఖ ఛానెల్ జియా టీవీ ఇచ్చిన సమాచారం మేరకు స్పష్టం అవుతోంది. జియో టీవీ సమాచారం ప్రకారం ఘటనా సమయంలో ఆస్పత్రిలోని గైనకాలజీ వార్డులో 16 మంది నవజాత శిశువులు ఉన్నారు. అందులో ఒక్కరిని మాత్రమే ఆస్పత్రి సిబ్బంది రక్షించగా మిగతా 15 మంది ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలోని ఎయిర్ కండీషనర్ లోని కంప్రెసర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది.

భవనంలోని థర్డ్ ఫ్లోర్ లో జరిగిన ప్రమాదంలో 15 మంది నవ జాతశిశువులు మొత్తం కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగం ధ్రువీకరించింది. ఇక మృతుల సంఖ్యపై తొలుత కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు 14 మందిగా పేర్కొన్నాయి. కానీ స్థానిక మీడియా, ఆసుపత్రి వర్గాలు 15 మంది శిశువులు మరణించినట్లు ధ్రువీకరించాయి. మరోవైపు ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications