అత్యవసర భేటీకి ఇస్లామిక్ దేశాల పిలుపు- పాలస్తీనా-ఇజ్రాయెల్ సమస్యపై తేల్చేందుకు..!
పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్ధ ఇజ్రాయెల్ పై మెరుపు దాడులకు దిగడం, ఆ తర్వాత ఇజ్రాయెల్ వారిపై ప్రతిదాడులకు దిగడంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరుదేశాల మధ్య సాగుతున్న పోరులో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు పాలస్తీనాకు అరబ్ దేశాలు అండగా నిలుస్తుండగా.. ఇజ్రాయెల్ కు పశ్చిమదేశాలు, యూరప్ దేశాలు అండగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై చర్చించేందుకు సౌదీ అరేబియాలో అత్యవసరమైన అసాధారణ సమావేశానికి ఇస్లామిక్ దేశాల కూటమి పిలుపునిచ్చింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సైనిక తీవ్రత, గాజాలో రక్షణ లేని పౌరులకు ముప్పు పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ సదస్సు ప్రస్తుత సెషన్‌కు అధ్యక్షత వహించిన సౌదీ అరేబియా బుధవారం జెడ్డాలో జరిగే సమావేశానికి సభ్య దేశాలను ఆహ్వానించింది.

సౌదీ అరేబియా ఆహ్వానం మేరకు గాజా, దాని పరిసర ప్రాంతాలలో తీవ్రమవుతున్న సైనిక పరిస్థితి, క్షీణిస్తున్న పరిస్థితులను పరిష్కరించడానికి సంస్థ కార్యనిర్వాహక కమిటీ అత్యవసర బహిరంగ అసాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. పౌరుల జీవితాలు, ఈ ప్రాంతం యొక్క మొత్తం భద్రత, స్థిరత్వం కోసం ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు తన వెబ్ సైట్లో పేర్కొంది. దీంతో బుధవారం ఓఐసీ భేటీలో తీసుకోబోయే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
నాలుగు ఖండాలలో విస్తరించి ఉన్న 57 దేశాల సభ్యత్వంతో ఐక్యరాజ్యసమితి తర్వాత ఓఐసీ రెండో అతిపెద్ద సంస్థగా ఉంది. ఇది తనను తాను ముస్లిం ప్రపంచం యొక్క సామూహిక స్వరంగా చెప్పుకుంటుంది. సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌తో సంబంధాలను పునరుద్ధరించడంపై చర్చలను ఇవాళ నిలిపివేయగా.. ఇవాళే ఓఐసీ ఈ పిలుపునివ్వడం విశేషం.












Click it and Unblock the Notifications