ముగిసిన మహా యుద్ధం! ఇజ్రాయెల్-లెబనాన్ సంచలన నిర్ణయం!
రోజురోజుకూ తీవ్రమవుతున్న ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న మధ్యప్రాచ్యంలో ఒక కీలకమైన ముందడుగు పడింది. ఎన్నాళ్లోగానో ఎదురుచూస్తున్న శాంతి చర్చల్లో ఎట్టకేలకు ఒక దౌత్య పురోగతి లభించింది. అమెరికా మధ్యవర్తిత్వంతో బుధవారం జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు "యుద్ధ విరమణ అమలు" చేయడానికి ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. అయితే, ఈ శాంతి ఒప్పందం పూర్తిగా అమల్లోకి రావాలంటే లెబనాన్ సరిహద్దుల్లోని హెజ్బోల్లా మిలిటెంట్లు తమ దాడులను పూర్తిగా ఆపేయాలని, దక్షిణ లెబనాన్ ప్రాంతం నుండి వారిని పూర్తిగా తొలగించాలనే గట్టి షరతులను ఇజ్రాయెల్ విధించింది.
వాషింగ్టన్‌లో మారథాన్ చర్చలు..
అమెరికా విదేశాంగ శాఖ వేదికగా బుధవారం దాదాపు తొమ్మిది గంటల పాటు ఈ మారథాన్ చర్చలు సాగాయి. అంతకుముందు మంగళవారం రోజంతా ప్రాథమిక చర్చలు జరిగాయి. లెబనాన్‌లో సైనిక చర్యలను మరింత ఉధృతం చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ చర్చలు జరగడం గమనార్హం. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో కాల్పుల విరమణ ఒప్పందాలు పదే పదే ఉల్లంఘించబడుతున్నా, పరస్పర దాడులు జరుగుతున్నా.. ఇరు దేశాలు శాంతి వైపు మొగ్గు చూపడం విశేషం. జూన్ 22వ తేదీ వారంలో రాజకీయ, భద్రతా పరమైన అంశాలపై పూర్తిస్థాయి సమగ్ర ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. అప్పటివరకు ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిగా ఉంటూ చర్చలను ముందుకు నడిపించనుంది.

సరిహద్దుల్లో 'పైలట్ జోన్లు’..
సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడానికి తక్షణ చర్యగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. లెబనాన్ సాయుధ దళాలు (LAF) మాత్రమే పూర్తి నియంత్రణ కలిగి ఉండేలా కొన్ని ప్రత్యేక 'పైలట్ జోన్లను' వేగంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ జోన్లలో హెజ్బోల్లా వంటి ఏ ఇతర సాయుధ ముఠాలకు చోటుండదు. అయితే, ఈ పైలట్ జోన్లు ఎంతకాలం అమలులో ఉంటాయనే దానికి మాత్రం ప్రకటనలో ఎలాంటి కాలపరిమితి విధించలేదు.
ఇజ్రాయెల్ భద్రత.. లెబనాన్ సార్వభౌమత్వం
ప్రాంతీయంగా దీర్ఘకాలిక శాంతి నెలకొనాలంటే హెజ్బోల్లాను పూర్తిగా నిరాయుధులను చేయాలని, లెబనాన్‌లో ఉన్న వారి మౌలిక సదుపాయాలను పూర్తిగా తొలగించాలని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అప్పుడే తమ దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు రక్షణ ఉంటుందని ఇజ్రాయెల్ పునరుద్ఘాటించింది. మరోవైపు, లెబనాన్ కూడా తన దేశ సరిహద్దులను గౌరవించాలని, అంతర్జాతీయ నియమాలను పాటించాలని కోరింది. అమెరికా మద్దతుతో దేశవ్యాప్తంగా తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కట్టుబడి ఉన్నామని లెబనాన్ తెలిపింది. ఇందుకు సంబంధించి లెబనాన్ సాయుధ దళాలకు అవసరమైన పూర్తి సాంకేతిక, సంస్థాగత సహాయాన్ని అందిస్తామని వాషింగ్టన్ (అమెరికా) హామీ ఇచ్చింది.
ఇరాన్ ప్రాక్సీ దాడులపై ఖండన
మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఇరాన్ చేస్తున్న దాడులను, అలాగే వివిధ దేశాల్లో మిలిటెంట్ గ్రూపుల (ప్రాక్సీలు) ద్వారా ఇరాన్ నడిపిస్తున్న నెట్‌వర్క్‌లను చర్చల్లో పాల్గొన్న అన్ని పక్షాలూ తీవ్రంగా ఖండించాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ శాంతి ప్రక్రియ విజయవంతం కాకపోతే, సమాంతరంగా జరుగుతున్న అమెరికా-ఇరాన్ చర్చలపై కూడా దీని ప్రభావం పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.














Click it and Unblock the Notifications