ఈ తరహా అభిమానం మీరెప్పుడైనా చూశారా..! కనీ విని ఎరుగని రీతిలో..
మనిషికి చావు ఉండొచ్చుగానీ అభిమానానికి మాత్రం చావు లేదు. ఆరాధించే వ్యక్తి భౌతికంగా దూరమైనా.. తను నడిపించిన మార్గం, తన ఆదర్శాలు సజీవంగా నిలిచిపోతాయి. అయితే ఆయా వ్యక్తులపై అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఒక్కొక్కరిది ఒక్కో పంథా. కొంతమంది విగ్రహాలు ఏర్పాటు చేస్తే.. మరికొంతమంది చనిపోయిన వ్యక్తులకు గుడి కట్టి పూజించడం.. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడో ఓ చోట జరగుతున్నవే.
ఇలాంటి ఓ సంఘటన దక్షిణ చైనాలో చోటు చేసుకుంది. అయితే ఇంతకుముందెన్నడూ కనీ విని ఎరుగని రీతిలో తమ గురువు పట్ల అభిమానాన్ని చాటుకుంటున్నారు శిష్యగణం. అయితే దీన్ని విపరీత అభిమానమని విమర్శించేవాళ్లు లేకపోలేదు. ఇంతకీ ఆ శిష్యులు చేసిన పనేంటంటే.. గురువు మరణాన్ని తట్టుకోలేక, ఆయన మృతదేహాన్ని మూడేళ్ల పాటు దాచిపెట్టిన శిష్యులు ఆ తర్వాత దానికి బంగారు పూత పూసి దాన్నో విగ్రహంగా మార్చి నిత్యం పూజించడం మొదలుపెట్టారు.

చాంగ్ ఫూ దేవాలయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 13వ ఏటనే బౌద్ధ భిక్షువుగా మారిపోయిన ఫూహోయ్ అనే బాలుడు ధమ్మ సూత్రాలను బోధిస్తూ.. తక్కువ కాలంలోనే మంచి ఆధ్యాత్మిక గురువుగా పేరు సంపాదించుకున్నారు. తన జీవితకాలమంతా 94 సంవత్సరాల పాటు చాంగ్ ఫూ దేవాలయంలోనే గడిపిన ఆయన, 2012లో మరణించారు.
గురువు మరణాన్ని జీర్ణించుకోలేని శిష్యులు మృతదేహానికి అనేక రసాయన లేపనాలు పూసి ఓ మమ్మీగా మార్చేశారు. ఆ తర్వాత ఒక కుండలో గురువు మృతదేహాన్ని కూర్చున్న భంగిమలో ఉంచి ఎవరికీ తెలియని రహస్య ప్రదేశంలో భద్రపరిచారు. ఈమధ్యే మళ్లీ దాన్ని బయటకు తీసిన శిష్యులు బంగారంతో పూత పూసి తళుక్కున మెరిసేలా చేశారు. ఇప్పుడా విగ్రహాన్ని పూజిస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు.












Click it and Unblock the Notifications