మారణహోమం సృష్టించిన జిహాదీ మూకలు.. 100 మందికి పైగా మృతి
ఉత్తర బుర్కినా ఫాసోలో జిహాదీ మూకలు నరమేధం సృష్టించాయి. వారు చేసిన భారీ హింసాత్మక దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో చాలా మంది సైనికులే ఉన్నారని తెలుస్తోంది. అలాగే పలువురు పౌరులు, మహిళలు, పిల్లలు కూడా ఈ ఉగ్ర దాడుల్లో బలయ్యారని సమాచారం.
డజిబో సహా పలు ప్రాంతాల్లో విచక్షణా రహితంగా దాడులు జరిపినట్టు స్థానికులు వాపోతున్నారు. బాధిత కుటుంబాల ప్రకారం.. దాడిలో కొందరు మహిళలు, బాలికలు అపహరణకు గురయ్యారని అంటున్నారు. ఈ ఘాతుక ఘటనల నేపథ్యంలో ప్రజల్లో భద్రతా వ్యవస్థపై తీవ్రమైన అసహనం వ్యక్తమవుతోంది. గత కొన్ని నెలలుగా బుర్కినా ఫాసోలో ఉగ్రవాద మూకల హింస పెరుగుతున్నా, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక భద్రతా దళాలు సరిగా స్పందించలేకపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తూ యునైటెడ్ నేషన్స్ సహా పలువురు అంతర్జాతీయ నేతలు స్పందించే అవకాశం ఉంది. ఈ తరహా ఘటనలపై గట్టి చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications