సంచలన నిర్ణయం తీసుకున్న జో బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వచ్చే ఏడాది అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్‌లో దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడే అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకునట్టే కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే సన్నాహాలు పూర్తి చేశారు. ఈలోపే ఆయన పోర్న్ స్టార్‌కు అక్రమ చెల్లింపుల కేసు వ్యవహారంలో దోషిగా తేలారు.
వచ్చే ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు నిక్కీ హేలీ ప్రకటించారు. భారత సంతతికి చెందిన మహిళ ఆమె. గతంలో ఆమె ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా పని చేశారు. అనంతరం రాజకీయాల్లో అడుగు పెట్టారు. రిపబ్లికన్ పార్టీలో చేరారు. సౌత్ కరోలినా గవర్నర్ రెండుసార్లు ఎన్నికయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంప్‌లో పని చేశారు.

భారత సంతతికే చెందిన వివేక్ రామస్వామి సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. రిపబ్లికన్ల తరఫున ఈ ఎన్నికల్లో నిల్చోనున్నట్లు ఇదివరకే ప్రకటించారు కూడా. ఇదే జాబితాలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, పెర్రీ జాన్సన్, టెడ్డీ క్రజ్, క్రిస్టీ నోయెమ్, మైక్ పాంపియో ఉన్నారు. ఇప్పుడున్న ఈ కంటెండెర్లల్లో రిపబ్లికన్లు ఎవరిని ఎన్నికల బరిలో దింపుతారనేది ఆసక్తిగా మారింది.
ఈ పరిణామాల నేపథ్యంలో- అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోన్నట్లు తెలిపారు. ఇది ప్రకటన కాదని, ప్లానింగ్ మాత్రమేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. వరుసగా రెండోసారి ఎన్నికల్లో నిల్చోవాలని ప్లాన్ చేస్తోన్నానని, దీన్ని ప్రకటనగా భావించొద్దని పేర్కొన్నారు. తాను రెండోసారి కూడా పోటీ చేస్తే- నిస్సందేహంగా గెలుస్తానని తేల్చి చెప్పారు.
ఈస్టర్ సందర్భంగా వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్టీలో జో బైడెన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన అభ్యర్థిత్వం ఖరారవుతుందా? లేదా అనేది- తాను తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పోటీ దిశగా తాను తుది నిర్ణయాన్ని తీసుకుంటే డెమోక్రాట్లు ఏకగ్రీవంగా ఆమోదిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.
అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున ఇప్పటికే ఇద్దరు రేసులో నిల్చొన్నారు. ప్రముఖ రచయిత్రి మరియాన్నె విలియమ్సన్, వ్యాక్సినేషన్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్త రాబర్ట్ కెన్నెడీ జూనియర్.. ఇప్పటికే తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదే జాబితాలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. జో బైడెన్ గనక అధ్యక్ష రేసు నుంచి తప్పుకొంటే కమలా హ్యారిస్ అభ్యర్థిత్వం ఖాయమౌతుందనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications