చేయరాని పనులు చేశాడు: జో బైడెన్ పై బాంబు పేల్చిన కమల హ్యారిస్
అమెరికా మాజీ ఉపాధ్యక్షురాల కమలా హారిస్ సంచలనాలకు తెర తీశారు. గత ఏడాది చివర్లో జరిగిన అధ్యక్ఝ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ కారణమని తేల్చి చెప్పారు. వయస్సు మీద పడినప్పటికీ.. వరుసగా రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి చివరి వరకూ విశ్వ ప్రయత్నాలు చేశారని, ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసిందని అన్నారు. అది అవివేకమని అభివర్ణించారు.
తాను రాసిన 107 డేస్ బుక్ లో ఈ అంశాలన్నీ పొందుపరిచారు. బైడెన్ రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడాలనే నిర్ణయం ఆయన వ్యక్తిగత అహంకారానికి అద్దం పట్టిందని విమర్శించారు. రెండోసారి పోటీ చేయాలనేది జో (బైడెన్), జిల్ (బైడెన్)ల వ్యక్తిగత నిర్ణయమని ధ్వజమెత్తారు. ఇది చివరికి డెమోక్రటిక్ పార్టీ ఓటమికి దారి తీసిందని కమలా హారిస్ వివరించారు. బైడెన్ వయస్సు, రెండోసారి అధ్యక్షుడిగా సమర్థవంతంగా పని చేయడంపై సందేహాలు వ్యక్తమౌతోన్న సమయంలో పోటీ వైపే ఆయన మొగ్గు చూపారని అన్నారు.

ఇది పార్టీలో అంతర్గత కలహాలకు కేంద్రబిందువు అయిందని కమలా హ్యారిస్ వివరించారు. జో బైడెన్, జిల్ బైడెన్ తీసుకున్న వ్యక్తిగత నిర్ణయాన్ని ఒక మంత్రంలా పాటించామని, అది అవివేకమని చెప్పారు. పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తరువాతే బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని, ఆ తర్వాతే తన పేరును ప్రతిపాదించారని హారిస్ తెలిపారు. అప్పటికే నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇది ఒక వ్యక్తి అహంకారంతో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ మద్దతు ఇవ్వలేదని అన్నారు.
బైడెన్ అభ్యర్థిత్వం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసే స్థానంలో అప్పట్లో తాను లేనని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. పోటీ చేయవద్దని సలహా ఇస్తే అది స్వార్థపూరిత నిర్ణయంగా అనిపిస్తుందనే విషయం తెలుసునని, దాన్ని బైడెన్ పార్టీ నిర్ణయంగా కాకుండా ద్రోహంగా చూసేవాడని తెలిపారు. వైట్ హౌస్ తో కూడా తన సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండేవని, బైడెన్ స్టాఫ్ తనను పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు.
పలు కీలక నిర్ణయాల్లో తన ప్రమేయం లేకపోవడాన్ని ప్రస్తావించారామె. రిపబ్లికన్ నాయకుల మాటల దాడుల నుండి తనను రక్షించడంలో విఫలమయ్యారని హారిస్ ఆరోపించారు. సమష్టి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నిబంధనల్లో ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘించాడని, అలా వ్యవహరించకూడదని తెలిసినా పట్టించుకోలేదని చెప్పారు.
ఉపాధ్యక్షురాలిగా తాను స్వేచ్ఛగా పని చేస్తే జో బైడెన్ ప్రతిష్ట మసకబారుతుందనే ఆలోచన ఆయన అడ్మినిస్ట్రేషన్ లో స్పష్టంగా కనిపించిందని కమలా హ్యారిస్ తేల్చి చెప్పారు. 2024 జులైలో నిర్వహించిన డిబేట్ పై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత రావడం వల్లే బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారని, అనంతరం తన పేరును ఆయన ప్రతిపాదించారని తెలిపారు.












Click it and Unblock the Notifications