Israel: ఇజ్రాయెల్-జోర్డాన్ సరిహద్దులో కాల్పులు.. కేరళ వ్యక్తి మృతి
Israel: ఇజ్రాయెల్-జోర్డాన్ సరిహద్దులో కేరళకు చెందిన ఓ వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ లోకి అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిపై జోర్డాన్ భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో కేరళలోని తిరువనంతపురానికి చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ పెరీరా ప్రాణాలు కోల్పోయాడు. థామస్ కేరళలో రిక్షా డ్రైవర్ గా పని చేస్తున్నట్లు తెలిసింది. అతను టూరిస్ట్ వీసా మీద జోర్డాన్ కు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇజ్రాయెల్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. భద్రతా దళాల్లో కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇదిలా ఉండగా.. దురదృష్ట పరిస్థితుల్లో ఒక భారతీయుడి విషాద మరణం గురించి తెలిసిందని జోర్డాన్ లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నామని.. ఈ విషయంపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మృతుడి మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి జోర్డాన్ అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు వెల్లడించింది. మరణవార్త ను అతడి కుటుంబానికి తెలియజేయడంతో.. సాధ్యమైనంత వరకు కాన్సులర్ సాయం అందిస్తున్నట్లు తెలిపింది.

అమ్మాన్ లోని భారత రాయబార కార్యాలయం మృతుడి కుటుంబానికి పంపిన లేఖ ప్రకారం.. మృతుడు కేరళ నివాసి. మరో ముగ్గురితో కలిసి టూరిస్ట్ వీసాపై జోర్డాన్ కు వెళ్లాడు. జోర్డాన్ భద్రతా దళాలు ఆ వ్యక్తిని తన సహచరుడితో కలిసి దేశ సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తుండగా కాల్చి చంపినట్లు సమాచారం. మృతుడిని తిరువనంతపురం సమీపంలోని తుంబా నివాసి థామస్ గాబ్రియేల్ పెరీరా (47) గా గుర్తించారు. మృతుడితో పాటు ఉన్న ఎడిసన్(43) అనే మరో వ్యక్తి జోర్డాన్ భద్రతా దళాల కాల్పుల్లో గాయపడినట్లు సమాచారం. ఎడిసన్ కూడా తుంబాకు చెందినవాడు. రెండు రోజుల క్రితం కేరళలోని తన ఇంటికి వచ్చాడు. ఎడిసన్ జోర్డాన్ వెళ్లిన 5 రోజుల తర్వాత ఫిబ్రవరి 10న ఈ ఘటన జరిగింది. థామస్, ఎడిసన్ లు ఇద్దరూ ఆటో రిక్షా డ్రైవర్లే.
థామస్ కుటుంబం ప్రకారం.. జోర్డాన్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి వారికి ఒక లేఖ అందింది. అందులో థామస్, మరొక వ్యక్తి కరాకక్ జిల్లాలోని జోర్డాన్ సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిని ఆపడానికి ప్రయత్నించాయి కానీ వారు హెచ్చరికను వినలేదు. గార్డులు వారిపై కాల్పులు జరిపారు. థామస్ తలలోకి బుల్లెట్ దూసుకెళ్లగా.. అక్కడికక్కడే మరణించాడు. థామస్ గుర్తింపును ధ్రువీకరించడానికి భారత అధికారులు ఆస్పత్రిని సందర్శిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు.
The Embassy has learnt of the sad demise of an Indian national in unfortunate circumstances. The Embassy is in touch with the family of the deceased and is working closely with Jordanian authorities for transportation of mortal remains of the deceased. @MEAIndia
— India in Jordan (@IndiainJordan) March 2, 2025
ధ్రువీకరణ తర్వాత థామస్ మృతదేహాన్ని భారత్ కు తీసుకురావడానికి ఏర్పాట్లు చేయబడతాయి. ఆ లేఖలో థామస్ గుర్తింపు కార్డు వివరాలను పంచుకోవాలని కుటుంబ సభ్యులను కోరింది. థామస్, ఎడిసన్ కుటుంబాలు ఫిబ్రవరి 5న టూరిస్ట్ వీసాపై జోర్డాన్ కు వెళ్లిన నలుగురిలో తాము కూడా ఉన్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications