గినియాలో విరిగిపడ్డ కొండ చరియలు.. 22 మందికిపైగా మృతి
పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గినియా రాజధాని కోనాక్రీ లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి 22 మందికిపైగా మృతి చెందారు. ఆ దేశంలోని సివిల్ ప్రొటక్షన్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఆదివారం అర్ధరాత్రి 3 గంటలకు భారీ వర్షాలు కురిశాయి. దాంతో కొండ ప్రాంతమైన కోనాక్రీలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం ఘటనాస్థలిలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వర్షాల కారణంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అక్కడి ప్రజలుకు ముందే అధికారులు నోటీసులు పంపారు. కానీ ప్రజలు మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

ఇప్పడున్న కుటుంబాలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నట్లు ఓ అధికారి స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే అధికారులు కొండ ప్రాంతంలోని గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారు. వర్షాలు మరి కొన్ని రోజులు కురిసే ప్రమాదం ఉన్న తరుణంలో రాజధాని లోని ఇతర ప్రాంతాల్లో వారికి తాత్కాలికంగా పునరావాసం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇక గినియా అనేది పశ్చిమ ఆఫ్రికాలోని ఓ తీర ప్రాంత దేశం. దీని రాజధాని కోనాక్రీ. ఈ దేశం పశ్చిమ ఆఫ్రికాలోని అట్లాంటిక్ మహా సముద్ర తీరంలో ఉంది. ఇక్కడి ప్రజలు అధికంగా ఫ్రెంచ్ మాట్లాడుతారు. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం గినియా జనాభా కోటీ 54 లక్షలుగా ఉంది.












Click it and Unblock the Notifications