మా దేశం మాక్కావాలి: లండన్ వీధులు రక్తసిక్తం
లండన్ లో ఆందోళనకారులు రోడ్డెక్కారు. యాంటీ- ఇమ్మిగ్రేషన్ పై గళమెత్తారు. నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శించారు. వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జి హౌస్ ఆఫ్ పార్లమెంట్ వద్ద జరిగిన యునైట్ ది కింగ్‌డమ్ ర్యాలీలో పాల్గొన్నారు. యూనియన్ జాక్, సెయింట్ జార్జ్ ఇంగ్లాండ్ జెండాలను ప్రదర్శించారు. అతివాద కార్యకర్త టామీ రాబిన్సన్ ఈ నిరసనలకు నాయకత్వాన్ని వహించారు. వలస వాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
లక్షమందికి పైగా స్థానికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పలుచోట్ల దాడులు సైతం చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. పోలీసులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. వారిపై బాటిళ్లను విసిరికొట్టారు. చేతికి అందిన వస్తువులతో దాడికి దిగారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఆందోళనకారులకు గాయాలయ్యాయి. వారిని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనల్లో 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్రీడమ్ పేరుతో టామీ రాబిన్సన్ ఈ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. బ్రిటన్ వ్యాప్తంగా దీనికి మంచి మద్దతు లభించింది. లక్షమందికి పైగా ఆందోళనకారులు దీనికి తరలివచ్చారు. స్టాండ్ అప్ టు రేసిజం విధానాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన నిర్వహించినట్లు ది గార్డియన్ తెలిపింది. తొలుత 10,000 మందితో ఈ నిరసన ప్రదర్శన ప్రారంభం కాగా.. క్రమంగా ఈ సంఖ్య 1,50,000కు చేరినట్లు వివరించింది.
అంచనాలకు మించిన స్థాయిలో ఆందోళనకారులు పాల్గొనడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. నిరసనకారులు పలుచోట్ల పోలీసులపై దాడులకు దిగారు. దీంతో పోలీసులు అల్లర్లను నిరోధించడానికి వినియోగించే లైఫ్ గార్డ్స్, హెల్మెట్స్, బుల్టెట్ ప్రూఫ్ వంటివి ధరించారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ దాడుల్లో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
అక్రమంగా తమ దేశంలో నివసిస్తోన్న వారందరినీ తక్షణమే వెనక్కి పంపేయాలని ఆందోలనకారులు డిమాండ్ చేశారు. మా దేశం మాక్కావాలి.. అంటూ నినదాలు చేశారు. యాంటీ- టెర్రర్ అలయన్స్ గ్రూప్ కూడా ఈ ప్రదర్శనలకు మద్దతు ఇచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు భారీ సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. కొందరు వయోధికులు వీల్ చైర్లల్లో ఈ నిరసనలకు హాజరయ్యారంటే.. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications