ప్రధాని సంచలనం: భారత్‌కు వ్యతిరేకంగా రాజపక్స చైనాను వాడుకున్నారు
కొలంబో: శ్రీలంక అధ్యక్షుడిగా రాజపక్స ఉన్నప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా చైనాను, చైనాకు వ్యతిరేకంగా భారత్‌ను ఉపయోగించుకునే ప్రయత్నాలు చేశారని శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే వెల్లడించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారిగా ఆయన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయం చెప్పారు.
భారత్, చైనాల విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు విఫలమైందన్నారు. రాజపక్స హయాంలో చైనాకు అనుకూలంగా మొగ్గు చూపే పరిస్థితి ఉండేదని, దానిని తాము సరిచేస్తామన్నారు. దేశ, విదేశీ ఒప్పందాలన్నింటిని సమీక్షిస్తామని, ఎక్కడైతే అవినీతి ఉందని తేలుతుందో అక్కడ చర్యలు తీసుకుంటామన్నారు.

అది చైనా అయినా, మరే మరే దేశమైనా చర్యలు తప్పవన్నారు. రాజపక్స హయాంలో శ్రీలంకలో ఓడరేవులు, విమానాశ్రయాల విస్తరణకు చైనా సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, వీటిని ముఖ్యంగా కొలంబో తీరంలో 1.5 బిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న సముదాయం పై కూడా సమీక్షిస్తున్నామన్నారు.
భారత్‌తో సత్సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సిరిసేన వచ్చే నెలలో భారత్‌లో పర్యటిస్తారన్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ గతంలో శ్రీలంకలో నిర్వహించిన పర్యటనలలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేస్తూ, చైనాతో బంధాలను పరిపుష్టం చేసుకుంటామని అధ్యక్షుడు సిరిసేన అన్నారు.












Click it and Unblock the Notifications