అదృశ్యమైన విమానం కూలింది: మాలావీ దేశ ఉపాధ్యక్షుడు సహా 10 మంది మృతి
మాలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలీమా ప్రయాణించిన విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆ విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలస్ చిలీమా సహా 10 మంది మృతి చెందారు. ఈ మేరకు మాలావీ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా ధృవీకరించారు. గల్లంతైన విమానం శకలాలు గుర్తించామని, అందులో ఎవరూ ప్రాణాలతో లేరని చెప్పారు.
మాలావీ ఉపాధ్యక్షుడు, మరో తొమ్మిది మందిని తీసుకెళ్తున్న సైనిక విమానం జూన్ 10న అదృశ్యమైంది. రాజధాని లిలోంగ్వే నుంచి బయల్దేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ఇందుకు, ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్ తో విమానం సంబంధాలు తెగిపోయాయి.

గల్లంతైన విమానం కోసం మాలావీ సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ.. వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులు ముమ్మరంగా గాలించారు. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను కూడా రంగంలోకి దించారు.
అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది మలావీ ప్రభుత్వం. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకు వచ్చాయని మలావీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఎవరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని వెల్లడించింది. కాగా, విమానంలో ఉపాధ్యక్షుడు, మాజీ అధ్యక్షురాలుతో పాటు మొత్తం ఏడుగురు ప్రయాణికులు ముగ్గురు సైనికసిబ్బంది ఉన్నారు. కాగా, ఇటీవలే ఇరాన్ అధ్యక్షుడు కూడా ఇలాంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications