మోదీ మాట తప్పాడు- ఇక నేనేంటో చూపిస్తా భారత్ కు ట్రంప్ అల్టిమేటం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి భారత్ ను హెచ్చరించారు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేయడానికి తక్షణమే పుల్ స్టాప్ పెట్టకపోతే మళ్లీ అదనపు టారిఫ్ లను విధించాల్సి ఉంటుందని అన్నారు. రష్యా నుండి చమురు దిగుమతులు నిలిపివేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని, దీన్ని ఇంకా ఆచరణలోకి తీసుకుని రావట్లేదని పేర్కొన్నారు. రష్యా ఆర్థికంగా బలపడటానికి భారత్ పరోక్షంగా తనవంతు సహకారాన్ని అందిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎయిర్ ఫోర్స్ వన్‌లో డొనాల్డ్ ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. భారత్- రష్యా వాణిజ్య సంబంధాల గురించి ప్రస్తావించారు. క్రూడాయిల్ ను భారీ ఎత్తున కొనుగోలు చేస్తోండటం వల్ల ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోన్న రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి భారత్ ఓ కారణమౌతోందని, దీన్ని వెంటనే నిలిపివేయాలని అన్నారు.

రష్యా నుంచి క్రూడాయిల్ ను కొనుగోలు చేయడాన్ని మానేస్తామని ప్రధాని మోదీ తనతో చెప్పారని, ఇంతకాలమైనా అది అమలు కావట్లేదని ట్రంప్ గుర్తు చేశారు. దీన్ని కొనసాగిస్తే, భారత్.. భారీ టారిఫ్ ను చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పారు. ట్రంప్ వాదనను భారత్ కొట్టిపడేసింది. అలాంటి హామీ ఏదీ కూడా ప్రధాని మోదీ ఇవ్వలేదని ఇదివరకే వివరణ ఇచ్చింది. ఇదే విషయాన్ని విలేకరులు గుర్తుచేయగా.. అదనంగా భారీ టారిఫ్ చెల్లించాలని భారత్ కోరుకోదు కదా.. అని బదులిచ్చారు.
రష్యా నుండి చమురు కొనుగోళ్లు ఆపేస్తామని మోడీ తనకు హామీ ఇచ్చారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీతో భేటీ సందర్భంగా చెప్పారు డొనాల్డ్ ట్రంప్. దీన్ని ముందడుగుగా అభివర్ణించారు. తన రోజువారీ చమురు వినియోగంలో మూడింట ఒక వంతు రష్యా నుండే కొనుగోలు చేస్తోందని, ఇది ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించడానికి అవసరమైన నిధులను భారత్ సమకూర్చినట్టవుతోందని వ్యాఖ్యానించారు.
ట్రంప్ వాదనను విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ప్రధాని మోదీ.. ట్రంప్ కు ఈ హామీ ఇచ్చినట్లు తమకు సమాచారం లేదని, ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. భారత్- అమెరికా మధ్య ఇంధన సహకారంపై చర్చలు కొనసాగుతున్నాయని, రష్యా చమురు కొనుగోళ్లను ఆపేయడానికి తాము అంగీకరించామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడానికి తగిన సమాచారం తన వద్ద లేదని అన్నారు.
ఇప్పటికే ఇష్టానుసారంగా భారత్ పై టారిఫ్ లను విధించారు ట్రంప్. రష్యాతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు. ఈ క్రమంలో భారత్ పై 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్న.. రష్యాతో క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్నందున మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది.












Click it and Unblock the Notifications