వీడని విమానం మిస్టరీ: భారత్ సెర్చ్, పైలట్ తీరుపై దృష్టి
కౌలాలంపూర్: కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్‌కు వెళ్తూ వారం రోజుల క్రితం అదృశ్యమైన మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎంహెచ్-370 ఆచూకీ ఇప్పటి వరకూ లభించలేదు. మొత్తం 239 మందితో వెళ్తున్న ఈ విమానం శనివారం తెల్లవారు జాము నుండి కనిపించడం లేదు. దీని కోసం పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. పైలట్ పైన ఆరోపణలు వస్తుండటంతో ఆ వైపు దృష్టి సారించారు. 2011లో ఆయన ఇద్దరు యువతులను కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మిస్ అయిన విమానం కెప్టెన్‌గా జహెరీ అహ్మద్ షా (53), ఫస్ట్ ఆఫీసర్ ఫారిఖ్ అబ్దుల్ హమీద్ (27)లు ఉన్నారు. ఫారిఖ్ 2011లో ఇద్దరిని కాక్‌పిట్‌లోకి ఆహ్వానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జహెరీ 1981లో మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో చేరారు. అతనికి ఇప్పటి వరకు 18,365 గంటలపాటు నడిపిన అనుభవం ఉంది.
కాగా, మలేసియన్ ఎయిర్‌లైన్స్ విమానానికి సంబంధించి రోజుకో కొత్త వాదన వినిపిస్తోంది. గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత కూడా విమానం దాదాపు 4 గంటలపాటు ఏకధాటిగా ప్రయాణించి ఉండవచ్చునని అమెరికా దర్యాప్తు నిపుణులు పేర్కొన్నారు. అయితే మలేసియన్ ప్రభుత్వం దీన్ని కొట్టిపారేసింది. 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన బోయింగ్ విమానం.. టేకాఫ్ అయిన గంట సేపట్లోనే దక్షిణ చైనా సముద్ర గగనతలంలో అదృశ్యమైంది.

విమానం కూలినట్లు భావిస్తున్న ప్రాంతానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను చైనా విడుదల చేసింది. మలేసియా, వియత్నాం మధ్య సముద్ర జలాల్లో మూడు వస్తువులు తేలుతూ కనిపించాయని, అయితే అవి విమానం శకలాలని చెప్పలేమని ఆ దేశ రక్షణ సంస్థ పేర్కొంది. దీన్ని ద్రువీకరించుకోవడానికి మలేసియా తన విమానాలను, దర్యాప్తు బృందాలను ఆ ప్రాంతానికి పంపింది. అయితే అక్కడేమీ కనిపించలేదని ఆ దేశ రవాణా మంత్రి వెల్లడించారు.
కనీసం శకలాలను గుర్తించే వరకూ ఈ దర్యాప్తులో ముందడుగేసినట్లు చెప్పలేమని ఆయన అన్నారు. విస్తృత స్థాయి దర్యాప్తు కోసం ఇతర దేశాలనూ భాగస్వాములను చేసేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపారు. విమానాన్ని వెతకడానికి భారత్ కూడా నాలుగు యుద్ధ నౌకలను, ఓ పి8ఐ విమానం, 2 హెర్కులస్ రవాణా విమానాలు, 3 హెలికాప్టర్లను కేటాయించింది.
అండమాన్ నేవీ కమాండ్ ఆధ్వర్యంలో కోస్టుగార్డులు రంగంలోకి దిగారు. మలేసియా ప్రభుత్వం సూచించిన ప్రాంతానికి యుద్ద నౌకల్లో బయలుదేరారు. నేవీకి చెందిన నిఘా ఉపగ్రహాన్ని కూడా వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అండమాన్ సముద్ర జలాల్లో అన్వేషణ మొదలైనా ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం లేదు.












Click it and Unblock the Notifications