అందరిలో ఒకడిగా- ఐరాసలో మోదీ యోగ సాధన
వాషింగ్టన్: ఇవ్వాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది యోగాసనాలు వేశారు. సూర్య నమస్కారాలు చేశారు. ప్రాణాయామంతో యోగా దినోత్సవాన్ని జరుపుకొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి నార్త్ లాన్‌లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. యోగా సెషన్‌ను స్వయంగా ఆయన లీడ్ చేశారు.
కొద్దిసేపటి కిందటే ఆయన నార్త్ లాన్‌కు చేరుకున్నారు. అంతకుముందు- ఐక్యరాజ్య సమితి ఆవరణలో ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. మౌనం పాటించారు. అనంతరం అక్కడి నుంచి నార్త్ లాన్‌కు చేరుకున్నారు. లాన్‌లో మోదీ అడుగు పెట్టిన వెంటనే అక్కడున్న వారు పెద్ద ఎత్తున ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. మోదీకి జైకొట్టారు.

ఆ సమయంలో మోదీ వెంట ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు సిసబ కొరొసి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె, న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, డిజిటల్ ఎవాంజలిస్ట్ వాలా ఆఫ్సర్, అవార్డ్ విన్నింగ్ స్టోరీ టెల్లర్ జై షెట్టి, భారత్‌కు చెందిన ప్రఖ్యాత చెఫ్ వికాస్ ఖన్నా, గ్రామీ అవార్డ్ విజేత రికీ కేజ్, ఆఫ్రికన్- అమెరికన్ సింగర్ మేరీ మిల్‌బెన్.. తదితర ప్రముఖులు ఉన్నారు. వారందరూ ఈ యోగా సెషన్‌లో పాల్గొంటోన్నారు.
#WATCH | PM Narendra Modi at the UN Headquarters lawns in New York, to lead the Yoga event on the occasion of #9thInternationalYogaDay pic.twitter.com/1kwsr6OnJq
— ANI (@ANI) June 21, 2023
తొలుత- ఐరాసలో భారత రాయబారి రుచిర కాంబోజ్ ప్రారంభోపన్యాసం చేశారు. ఐక్యరాజ్య సమితి వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవాలను జరుపుకోవడం ప్రత్యేక సందర్భంగా అభివర్ణించారు. ఈ విశ్వ వేదికపై యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం ఒక ఎత్తయితే- దీనికి ప్రధాని మోదీ స్వయంగా నాయకత్వం వహించడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. మోదీ చేసిన ప్రతిపాదనల మేరకే జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించినట్లు రుచిర కాంబోజ్ గుర్తు చేశారు.
అనంతరం మోదీ మాట్లాడారు. సమస్త మానవాళికి యోగా దిక్సూచిగా మారిందని వ్యాఖ్యానించారు. యోగా ప్రాధాన్యతను విశ్వవ్యాప్తం చేయాలంటూ పిలుపునిచ్చారు. యోగా అనేది ఒక జీవన విధానమని గుర్తు చేశారు. ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు కోసం యోగాను తమ జీవితంలో ఓ భాగంగా అలవర్చుకోవాల్సి అవసరం ఉందని అన్నారు. సదాలోచనలు, సానుకూల దృక్పథాలను సాధించడానికి ఇదొక మార్గమని పేర్కొన్నారు.

శారీరకంగా ఆరోగ్యాన్ని, మానసికంగా సంతోషాన్ని అందించడమే కాకుండా తోటివారిపై దయను కలిగి ఉండటానికీ యోగా సహకరిస్తుందని మోదీ అన్నారు. ప్రజల మధ్య స్నేహం, శాంతి, పరిశుభ్రత, పచ్చదనం, సుస్థిరమైన సానుకూల దృక్ఫథాలను ఇది బాటలు వేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రపంచ మొత్తం వసుధైక కుటుంబకం అనే నినాదాన్ని నిజం చేయడానికి చేతులు కలుపుదామంటూ సూచించారు.












Click it and Unblock the Notifications