15నెలలుగా ఎయిర్‌పోర్టులోనే తల్లీకూతుళ్లు!
సిప్రస్: ఆ తల్లీకూతుళ్లకు ఇంటి కంటే విమానాశ్రయమే బాగా నచ్చినట్లుంది. అందుకే వారిద్దరు ఏకంగా 15 నెలల నుంచి అక్కడే నివాసముంటున్నారు. విమానాశ్రయంలోని రెస్టారెంట్లలో తింటారు. వైఫై సాయంతో స్మార్ట్ ఫోన్లను వాడుతారు. షాపింగ్ సెంటర్లు తిరుగుతారు. రాత్రి అయితే, నేలపై పడుకొని నిద్రపోతారు.
ఇలా వారిద్దరూ 15 నెలలుగా సైప్రస్‌లోని లార్నాకా విమానాశ్రయంలో సాఫీగా ఉంటున్నారు. జర్మనీకి చెందని ఈ తల్లీ కూతుళ్లు ఇజ్రాయిల్‌లో కొంతకాలం వున్నారు. వీసా గడువు తీరిపోయినా, దేశం వీడలేదంటూ.. వీరిద్దరినీ ఇజ్రాయిల్ బలవంతంగా పంపించేసింది.
అయితే తిరిగి అక్కడికే వెళ్లాలన్నది వీరి కోరిక. ‘మీ దేశాని(జర్మనీ)కి మీరు వెళ్లండి' అంటూ విమానాశ్రయ అధికారులు నెత్తినోరుమొత్తుకుంటున్నా వీరు మాత్రం అక్కడే ఉంటున్నారు.

కాగా, ఇంతకాలమూ మానవత్వాన్ని ప్రదర్శించి మిన్నకున్నామని, ఇక వీరిని బలవంతంగా తరలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ తల్లీకూతుళ్లు ఎయిర్ పోర్టులో ఉండటమా? లేదా అనేది అక్కడి అధికారుల మీద ఆధారపడినట్లయింది.
ఈ తల్లీకూతుళ్లు తమ సాయం కోరలేదని జర్మన్ ఎంబసీ స్పష్టం చేయడం గమనార్హం. ఇది ఇలా ఉండగా, వీరి గురించి తెలిసిన వారు 'ద టెర్మినల్' చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఫ్రాన్స్‌లోని చార్లెస్ డె గౌలీ విమానాశ్రయంలో ఇరాన్ శరణార్థి మెహ్రాన్ కారిమి ఎనిమిదేళ్లు గడిపిన కథ ఆధారంగా ఈ చిత్రం తీసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications