పాక్ లో దారుణం.. బైక్ బాంబ్ తో పోలీస్ స్టేషన్ ను పేల్చేశారు..!
పాకిస్థాన్ లోని ఖైబర్ ఫంఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లో బన్ను జిల్లా మిర్యానా పోలీస్ స్టేషన్ ముందు జరిగిన భారీ పేలుడు ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక మీడియా ధ్రువీకరించింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. మిర్యానా పోలీస్ స్టేషన్ సమీపంలో పేలుడు సామాగ్రితో ఉన్న ఓ మోటర్ సైకిల్ ను గుర్తు తెలియని దుండగులు పార్కింగ్ చేశారు. డిటోనేటర్ సాయంతో దాన్ని పేల్చివేశారు. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో 14 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.
ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ బృందాలు మృత దేహాలను వెలికి తీశాయి. అలాగే క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపాయి. పోలీసుల కథనం ప్రకారం.. పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న దుకాణాల వద్ద పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడులో పోలీస్ స్టేషన్ లోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అక్కడే ఉన్న సాధారణ ప్రజలు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ పేలుడు ఘటన జరిగిన వెంటనే బన్ను జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్ లను ఘటనాస్థలికి మోహరించింది. అలాగే ఆర్మ్ డ్ పర్సనల్ క్యారియర్స్ ఫోర్స్ కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ పేర్కొంది. ఇక ఆ ప్రాంతాన్ని పోలీసులు, సెక్యూరిటీ దళాలు పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. అణువణువూ గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తును చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక ఫిబ్రవరి 7న ఇదే బన్ను జిల్లాలో ఇద్దరు పోలీసులపై దాడులు జరిపారు దుండగులు. వారిని తీవ్రంగా గాయపరిచారు. ఖోనియా ఖేల్ పోలీస్ చెక్ పోస్టు వద్ద జరిపిన కాల్పుల్లో ఇద్దురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో ఘటనలో మిరాఖేల్ పోలీస్ స్టేషన్ టార్గెట్ గా దుండగులు దాడులకు పాల్పడ్డారు.

గతకొంత కాలంగా పాకిస్థాన్ లోని ఖైబర్ ఫంఖ్తుత్ఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో టెర్రరిస్టుల కార్యకలాపాలు అధికంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ ప్రభుత్వానికి, తెహ్రీక్- ఈ- తాలిబాన్(TTP)కు మధ్య జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందం 2022 లో ముగిసినప్పటి నుంచి ఈ దాడులు అధికంగా నమోదవుతున్నట్లు స్పష్టం అవుతోంది. గతేడాదిలోనే పాకిస్థాన్ లో 699 దాడులు జరిగాయి. ఇవి 2024 కంటే 34 శాతం అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications